Share News

అందరికీ బీమా..ఆహార ధీమా!

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:33 AM

ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే.. ఆ కుటుంబం చిన్నభిన్నమవుతుంది! ఆర్థిక భరోసా లేని పేద, మధ్య తరగతి కుటుంబాలైతే రోడ్డునపడతాయి! తెలంగాణలో ఏ ఒక్కరికీ ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.....

అందరికీ  బీమా..ఆహార ధీమా!

  • బడ్జెట్లో కొత్త పథకాలను ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌.. సకల జనులపై వరాల జల్లులు

  • రేషన్‌ కార్డుదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం

  • రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా

  • కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా పరిహారం

  • పాఠశాల విద్యార్థులకు అల్పాహారంగా పాలు, రాగి జావ

  • ఇంటర్‌ విద్యార్థులకూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం

  • పట్టాలపైకి ప్రభుత్వోద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం

  • దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా స్కీం

  • ఉద్యోగి ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 1.2 కోట్లు

  • చేయూత పథకం కింద మరో రెండు లక్షల పింఛన్లకు ఓకే

  • ‘సీఎం ఓవర్సీస్‌ ఎంప్లాయిమెంట్‌’తో యువతకు ఉపాధి

  • ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2000 ఉపకార వేతనం

  • ఈ ఏడాది ఎక్సైజ్‌ నుంచి అదనంగా 4వేల కోట్లు పిండే ప్లాన్‌

ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే.. ఆ కుటుంబం చిన్నభిన్నమవుతుంది! ఆర్థిక భరోసా లేని పేద, మధ్య తరగతి కుటుంబాలైతే రోడ్డునపడతాయి! తెలంగాణలో ఏ ఒక్కరికీ ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది! దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ రెండో తేదీ నుంచి దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలో రేషన్‌ కార్డులు కలిగిన 1.15 కోట్ల కుటుంబాలకూ ఈ పథకం వర్తించనుంది!

ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ విద్యార్థులు స్కూలుకు వెళ్లారనుకోండి! పొద్దున్నే అక్కడే అల్పాహారం పెడతారు! మధ్యాహ్నం భోజనం పెడతారు! ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌’ పేరిట ఆధునిక మౌలిక సదుపాయాలతో మంచి చదువు చెబుతారు! విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లి.. తీసుకొచ్చే రవాణా సదుపాయాలూ ఏర్పాటు చేస్తారు! ఈ మేరకు రేవంత్‌ సర్కారు మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది!

ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య పథకం ఎట్టకేలకు పట్టాలకెక్కనుంది! దాదాపు 23.5 లక్షల మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరనుంది. అంతేనా.. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్నీ ప్రకటించింది! దురదృష్టవశాత్తూ, ఉద్యోగి ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రూ.1.2 కోట్ల పరిహారం దక్కనుంది!

..


రాష్ట్రంలోని సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అడుగడుగునా ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా.. ప్రీ ప్రైమరీ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరిపైనా వరాలు కురిపించింది. ఆదాయం పెంచుకుంటూనే అభివృద్ధికి బాటలు పరుస్తున్నామని సంకల్పం చెప్పుకొంది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో; సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శాసన మండలిలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ‘‘బడ్జెట్‌ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు. ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు’’ అని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న ఆయన.. అందుకు అనుగుణంగానే కీలక పథకాలను ప్రకటించారు. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యం కాని రీతిలో, కనీవినీ ఎరుగని మహత్తర ‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాని’కి శ్రీకారం చుడుతున్నామన్నారు.

పథకాలకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలతోపాటు పాత, కొత్త పథకాలన్నింటికీ కలిపి ఈసారి ఏకంగా రూ.1,45,591 కోట్లను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటికి కేవలం రూ.1,04,329 కోట్లను మాత్రమే కేటాయించగా.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.41,262 కోట్లను అదనంగా కేటాయించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. దీనికి రూ.19,269 కోట్లను పెంచి రూ.3,24,234 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు కాగా; మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే... పాత బడ్జెట్‌ కంటే కొత్త బడ్జెట్‌ 6.31 శాతం ఎక్కువ. బడ్జెట్లో సాగు, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ రెండు రంగాలకే మొత్తం బడ్జెట్లో 26.66 శాతం నిధులు కేటాయించారు. ఇందులో వ్యవసాయం, సహకారం, పశు సంవర్థక, మత్య్స, సాగునీటిపారుదల వంటి రైతు సంబంధిత శాఖలకు 14.59 శాతం నిధులు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమానికి 12.07 శాతం నిధులు కేటాయించడం విశేషం! రైతు సంబంధిత శాఖలకు రూ.47,323 కోట్లు కోటాయించారు. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖలకు కేటాయించిన రూ.49,486 కోట్లతో పోలిస్తే.. రూ.2,163 కోట్లు తక్కువ. ఇక, సంక్షేమ శాఖలకు ఈసారి రూ.39,144 కోట్లను కేటాయించారు. 2025-26లో ఈ శాఖలకు కేటాయించిన రూ.36,941 కోట్ల కంటే.. ప్రస్తుత కేటాయింపులు రూ.2,203 కోట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.

2.jpg


విద్య మూలమిదం జగత్‌!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న విద్యా శాఖకు బడ్జెట్లో ఏకంగా రూ.26,674 కోట్లు కేటాయించారు. అనేక కొత్త పథకాలను ప్రకటించారు. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 2,000 నుంచి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ఇప్పటి వరకూ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం మాత్రమే అందుబాటులో ఉంది. ఇకనుంచి, ఈ పథకాన్ని ఇంటర్మీడియట్‌ వరకూ విస్తరించనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. అంతేనా.. ఇక నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ విద్యార్థులకు అల్పాహార పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందజేస్తారు. అలాగే, ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు’గా మార్చి.. వాటిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.

ఉద్యోగులకు వరం

బడ్జెట్లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దాదాపు 23,51,000 మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రకటించారు. దీనిని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,998 రకాల చికిత్సలు/శస్త్ర చికిత్సలు అందించనున్నారు. దీనికి ఉద్యోగుల వాటా కింద రూ.528 కోట్లు, ప్రభుత్వ వాటా కింద రూ.528 కోట్లు.. మొత్తం రూ.1026 కోట్లను ఖర్చు చేయనున్నారు. అలాగే, ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.2 కోట్ల బీమా వర్తించనుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల కవరేజీ వర్తిస్తుంది. ఈ పథకం, 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తించనుంది.


6.jpg

యువతకు జయహో..

యువతకు బడ్జెట్లో కొత్త పథకం ప్రకటించారు. వారికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి లభించే ఆయా దేశాల భాషలపై శిక్షణ ఇప్పిస్తారు. అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు సృష్టిస్తారు. వీసాలపై మార్గదర్శకత్వంతోపాటు అక్కడికి వెళ్లడానికి సహకారమూ అందిస్తారు. ఈ మేరకు సీఎం ఓవర్సీస్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు. దీనికి బడ్జెట్‌లో రూ.1,056 కోట్లను ప్రతిపాదించారు. అలాగే, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో శిక్షణ పొందుతున్న ట్రెయినీలకు ప్రతి నెలా రూ.2 వేలను ఉపకార వేతనాల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లో దీనికి రూ.80 కోట్లను కేటాయించింది.

1.jpg

ఈసారి పంటలకు బోనస్‌

ఇప్పటి వరకూ సన్న వడ్లకే బోనస్‌ ఇస్తున్న ప్రభుత్వం.. ఇకనుంచి పంటలకు బోనస్‌ ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది. సన్న వడ్లకు బోనస్‌ కింద రూ.1800 కోట్లుగా ఉన్న కేటాయింపులను రూ.3,500 కోట్లకు పెంచింది. తద్వారా, సన్న వడ్లకే కాకుండా మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలకు కూడా బోనస్‌ ఇస్తామనే సంకేతాలను ఇచ్చింది. అలాగే, పంటల బీమా పథకానికి రూ.1886 కోట్లను కేటాయించింది.


5.jpg

వృద్ధులకు చేయూత

చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులు, గీత, నేత, బీడీ కార్మికులు వంటి వర్గాలకు సామాజిక పింఛన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికింద దాదాపు 41.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఎవరైనా మరణిస్తే, ఆ కుటుంబంలోని వారికి.. అక్కడక్కడ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. తప్పితే, కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. తాజా బడ్జెట్‌లో కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత పింఛన్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. నిధులను మాత్రం పెంచలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.14,861 కోట్లనే తాజా బడ్జెట్‌లోనూ కేటాయించింది.

3.jpg

ఆదాయం ఓకే ఓకే!

గత (2025-26) ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు తగ్గినా ప్రస్తుత బడ్జెట్లో మాత్రం ఆదాయాన్ని భారీగానే పెంచి చూపారు. 2025-26 బడ్జెట్లో రెవెన్యూ వసూళ్లను రూ.2,29,720 కోట్లుగా అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో వీటిని కాస్తా రూ.2,03,970 కోట్లకే పరిమితం చేశారు. అయినా, ఈసారి బడ్జెట్లో రూ.2,41,263 కోట్లను ప్రతిపాదించారు. వీటిలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అంచనాల మేరకే వస్తుండగా.. రాష్ట్ర రెవెన్యూ మాత్రం పది వేల కోట్ల వరకూ తగ్గడం విశేషం. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1.45 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. రూ.1.34 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. దాంతో, ఈసారి బడ్జెట్లో కేవలం రూ.1.48 లక్షల కోట్లను మాత్రమే ప్రతిపాదించడం విశేషం. వీటిలో వాణిజ్య పన్నుల ద్వారా దాదాపు రూ.5000 కోట్లు అదనంగా వస్తాయని ప్రతిపాదిస్తే.. ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ.4000 కోట్లు అదనంగా వస్తాయని పేర్కొనడం గమనార్హం. 2025-26 బడ్జెట్‌ సవరించిన అంచనాల్లో ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ.23,623 కోట్లు రాగా.. రాబోయే బడ్జెట్లో దీని కింద రూ.27,668 కోట్లను ప్రతిపాదించారు.


ఇక, భూముల అమ్మకం ద్వారా సమకూరే రెవెన్యూయేతర ఆదాయాన్ని కూడా భారీగా పెంచడం విశేషం. 2025-26 బడ్జెట్లో దీని కింద రూ.31,618 కోట్లు వస్తుందని అంచనా వేస్తే.. సవరించిన అంచనాల్లో రూ.29,318 కోట్లు పేర్కొన్నారు. కానీ, ఈసారి బడ్జెట్లో 35,730 కోట్లను ప్రతిపాదించడం విశేషం. అలాగే, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాపై సర్కారు ఆశలు పెట్టుకుంది. 2025-26 బడ్జెట్లో రూ.29,899 కోట్లు అంచనా వేస్తే సవరించిన అంచనాల్లో దీనిని రూ.29,471 కోట్లుగా పేర్కొంది. దాంతో, ఈసారి బడ్జెట్లో రూ.33,181 కోట్లుగా ప్రతిపాదించింది. ‘‘కేంద్రానికి పన్నుల రూపంలో ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తుంటే.. తిరిగి కేంద్రం పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయిలో సగటున 42 పైసలే. జనాభా నియంత్రణ పాటిస్తూ, సొంత రాబడి పెంచుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది. ఈ చారిత్రక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించింది. తద్వారా కేంద్ర పన్నుల పంపకం ఫార్ములాలో కేవలం జనాభా, ఆదాయ వ్యత్యాసాల లాంటి అంశాలనే కాకుండా... రాష్ట్ర జీఎస్‌డీపీని కూడా కీలక కొలమానంగా పరిగణనలోకి తీసుకునేలా ఒప్పించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనివల్ల పన్నుల ఆదాయం వాటా 2.102 శాతం నుంచి 2.174 శాతానికి పెంచుకున్నాం’’ అని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక, అప్పులకు ఢోకా లేకపోవడంతో క్యాపిటల్‌ వసూళ్లు అంచనాలను మించుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా రూ.80 వేల కోట్లు అప్పులు చేస్తామని పేర్కొన్న సర్కారు.. అందులో రూ.23 వేల కోట్లను రుణ బాకీలను తిరిగి చెల్లించడానికే వెచ్చిస్తామని పేర్కొంది.

4.jpg

ప్రాజెక్టుల పనులకు 12,836 కోట్లే!నీటిపారుదల శాఖకు మొత్తం 22,615 కోట్లు

కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.12,836 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నీటిపారుదల శాఖకు 22,615 కోట్లను కేటాయించింది. ఈ బడ్జెట్‌లో భూసేకరణకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్‌ ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు. దాంతో 12,836 కోట్ల నుంచే రూ.5 వేల కోట్లను భూసేకరణకు కేటాయిస్తారా..? లేక ప్రత్యేకంగా నిధులు ఇస్తారా...? లేదా..? తేలాల్సి ఉంది.

Updated Date - Mar 21 , 2026 | 07:00 AM