2029లోనే అసెంబ్లీ ఎన్నికలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:14 AM
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029 మే, జూన్ నెలల్లో జరిగే అవకాశం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ చెప్పారు.
తెలంగాణలో చివరి ఆరు నెలలు రాష్ట్రపతి పాలన
డీలిమిటేషన్, మహిళా బిల్లు తర్వాత జమిలి ఎన్నికలు
డిసెంబరులోపు డీలిమిటేషన్ కాకుంటే జనాభా ఆధారంగానే సీట్ల పెంపు
ప్రజా భాగస్వామ్యంతోనే నషాముక్త్ భారత్: కె. లక్ష్మణ్
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029 మే, జూన్ నెలల్లో జరిగే అవకాశం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ చెప్పారు. 2028 డిసెంబరుతో శాసనసభ గడువు తీరిపోతుందని, అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంటుందని, ఆ సమయంలో తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందుతాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అనంతరం 2027లో ’ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కోసం బిల్లు కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించండం సాధ్యం కాదని, దశలవారీగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆ ప్రకారంగా ఒక ఏడాది అటూ ఇటూ గడువు ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ విధంగా తొలిదశలో జమిలి ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలు తెలంగాణతో కలిపి 17 వరకు ఉంటాయని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతుండటం, ఆ బాధ్యతలను ఆ ప్రక్రియలో ఉపాధ్యాయులు భాగస్వాములవుతుండటంతో బోధనకు ఆటంకాలు ఏర్పడటం ద్వారా విద్యార్థుల చదువు దెబ్బతింటోందని, కోడ్ కారణంగా అభివృద్ధి పనులకూ ఆటంకం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ శుక్రవారమిక్కడ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాజా డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదనతో విపక్షాల అసలు రంగు బయటపడుతుందన్నారు.
డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు 50శాతం పెరుగుతాయని, జనాభా ప్రాతిపదికన కాకుండా, ఇప్పుడున్న సీట్ల సంఖ్యకు అనుగుణంగా పెంచాలని నిర్ణయించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలకు తెరపడిందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లు ఈ ఏడాది డిసెంబరులోగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందకపోతే గనక ఆ తర్వాత జనాభా ప్రాతిపదికనే సీట్ల సంఖ్య పెంచాల్సి వస్తుందని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కారణంగా యూపీలో నష్టపోయింది బీజేపీయేనని అభిప్రాయపడ్డారు.
సర్ కింద చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించారని, రెండు చోట్ల ఓటు ఉన్న వారి పేర్లను ఒకచోటుకు పరిమితం చేశారని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో గతంలో 3 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 1.7 లక్షలకు తగ్గాయన్నారు. హైదరాబాద్‌లో గతంతో పోలిస్తే.. 45 శాతం ఓట్లు పోయాయని లక్ష్మణ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీని అందుకు తగ్గ ఆధారాలు తీసుకురావాలని కోర్టు చెప్పిందని, ఆయన ఇప్పటిదాకా ఆధారాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాగా నపా ముక్త టాస్క్‌కు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. వెయ్యిమంది ఈ సైకిల్ యాత్రలో పాల్గొంటారని.. ఆ రోజు ఉదయం నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం నుంచి లక్డీకాపూల్, సైఫాబాద్ మీదుగా ఆరు కిలో మీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News