అవినీతి అధికారులు కటకటాల్లోకి
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:23 AM
అవినీతితో రూ.కోట్ల ఆస్తులను కూడబెట్టి ఏసీబీకి చిక్కిన అధికారులు కటకటాలను లెక్కిస్తున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టు అయిన 70మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
70 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిమాండ్‌లో..
తెలంగాణ వచ్చాక ఇదే అధికం
కాంగ్రెస్ హయాంలో పెరిగిన ఏసీబీ దూకుడు, కేసుల సంఖ్య
బెయిల్ పిటిషన్లను గట్టిగా వ్యతిరేకిస్తున్న ఏసీబీ
సగటున 40-60 రోజులు రిమాండ్‌లో నిందితులు
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అవినీతితో రూ.కోట్ల ఆస్తులను కూడబెట్టి ఏసీబీకి చిక్కిన అధికారులు కటకటాలను లెక్కిస్తున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టు అయిన 70మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లోనే 34మంది ఉండగా, మిగిలిన వారు ఖమ్మం, కరీంనగర్ జైళ్లల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు జైళ్లలో ఉండటం ఇదే ప్రథమమని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అవినీతి కేసుల్లో పట్టుబడిన నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సులభంగానే బెయిల్ లభించేది. కానీ, ఏసీబీ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో అవినీతికి పాల్పడి అరెస్టైన ఉద్యోగులు దాఖలు చేసే బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కౌంటర్లు దాఖలు చేసి, బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని గట్టిగా వాదనలను వినిపిస్తోంది. చాలా సందర్భాల్లో ఒకట్రెండు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాతే నిందితులకు బెయిల్ లభిస్తోంది. అప్పటికే వారు జ్యుడీషియల్ రిమాండ్‌లో సగటున 40-60 రోజుల వరకు ఉంటున్నారు. అక్రమార్జన కేసులో నిమ్స్ పరిపాలన అధికారి లక్ష్మీభాస్కర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లక్ష్మీభాస్కర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు రెండుసార్లు తిరస్కరణ గురయ్యాయి. 48 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తర్వాత తాజాగా ఆయనకు బెయిల్ లభించింది. రూ.వందల కోట్ల అక్రమార్జన, బినామీల పేరిట రూ.కోట్ల ఆస్తులను పెట్టిన డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఈ ఏడాది జూలై 6వ తేదీన అరెస్టు చేయగా, 57 రోజుల రిమాండ్ తర్వాత సెప్టెంబరు 1న బెయిల్ లభించింది.
వారు వీరని లేకుండా ఉన్నత హోదాల్లో పని చేసిన వారిని సైతం ఏసీబీ.. అవినీతి కేసుల్లో అరెస్టు చేసి జైళ్లకు తరలిస్తోంది. వీరిలో ఎక్కువగా పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఉంటున్నట్లు సమాచారం. 2025 అక్టోబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు వరకు 144 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ జైళ్లల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. వీరిలో 121 మంది వరకు అవినీతి సొమ్ము తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వారే. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న (డీఏ) కేసుల్లో అరెస్టవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ అవిర్భావం తర్వాత కొన్నాళ్లు ఏసీబీ దూకుడుగానే వ్యవహరించినప్పటికీ.. 2019 నుంచి 2023 వరకు కిందిస్థాయి ఉద్యోగులనే ఎక్కువగా పట్టుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అవినీతి అధికారులను పట్టుకొని ఆధారాలతోసహా వారి అక్రమార్జనను బయటపెడుతున్నారు. దీంతో డీఏ కేసుల నమోదు భారీగా పెరిగింది.
ఈ ఏడాది నమోదైన భారీ కేసులు
హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్, గజ్వెల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్, వాటర్ బోర్డు జీఎం అనంత లక్ష్మీకుమార్, డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్, అర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి సుంకరి నరహరి, పోలీసు అధికారులు భుజంగరావు, భీంరెడ్డి, ఆంజనేయులు, టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, నిమ్స్ ఉన్నతాధికారి లక్ష్మీభాస్కర్, ఇరిగేషన్ ఉన్నతాధికారి రాగిరి సత్యనారాయణ, మెప్మా అధికారి యాదగిరిరావు కేసులు భారీ మొత్తాల్లో అక్రమార్జన బయటపడిన కేసులుగా నిలుస్తున్నాయి. కాగా, ఏసీబీ కేసుల్లో అరెస్టు అయిన ప్రభుత్వ అధికారులను సాధారణ నేరస్థులతో కలిపి ఉంచకుండా, నిబంధనల ప్రకారం వైట్ కాలర్ నేరాలకు పాల్పడిన వారిని ఉంచే బ్యారక్స్‌లో ఉంచుతున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News