Share News

65 కాలేజీల్లో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు!

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:19 AM

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ కాలేజీల అనుబంధ గుర్తింపు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాల అమలుపై వస్తున్న విమర్శలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి (టీజీబీఐఈ) ఖండించింది.

65 కాలేజీల్లో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు!
Telangana Intermediate Board

  • కార్పొరేట్‌ కాలేజీలకు రూ.4 కోట్ల జరిమానా

  • 3,241 కాలేజీలకు అనుమతులు..

  • పరిశీలన మరో 12 దరఖాస్తులు

  • జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల

  • ఆరోపణలపై ఇంటర్‌ బోర్డు వివరణ

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ కాలేజీల అనుబంధ గుర్తింపు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాల అమలుపై వస్తున్న విమర్శలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి (టీజీబీఐఈ) ఖండించింది. కాలేజీల యాజమాన్యాలు, సంఘాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని బోర్డు కార్యదర్శి అభిలాష ఆదివారం స్పష్టతనిచ్చారు. కాలేజీల్లో భద్రతా ప్రమాణాల తనిఖీల సందర్భంగా మొత్తం 65 కాలేజీలు నకిలీ అగ్నిమాపక భద్రతా పత్రాలు (ఫైర్‌ సేఫ్టీ ఎన్‌ఓసీలు) సమర్పించినట్లు గుర్తించామని బోర్డు వెల్లడించింది. నిబంధనల ప్రకారం అసలైన పత్రాలను సమర్పించాలని కాలేజీలకు పలుమార్లు అవకాశాలు కల్పించినట్లు పేర్కొంది.


కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలను టీజీబీఐఈ తోసిపుచ్చింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినందుకు 2026 జూలై నుంచి అక్టోబరు మధ్యకాలంలో వివిధ కార్పొరేట్‌ కాలేజీలపై రూ.4 కోట్లకు పైగా జరిమానాలు విధించినట్లు తెలిపింది. ఒత్తిళ్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందేందుకు ప్రయత్నించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించింది. కాలేజీల్లో ఉన్న లోపాలను ప్రజలకు తెలియజేసేందుకు వాటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి 3,241 జూనియర్‌ కాలేజీలకు ప్రవేశాల నిర్వహణకు అనుమతులు ఇచ్చినట్లు బోర్డు వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల సంఖ్య 3,349గా ఉందని, మరో 12 కాలేజీలకు సంబంధించి ప్రాంగణ మార్పు, అవసరమైన పత్రాల సమర్పణ వంటి అంశాలపై పరిశీలన కొనసాగుతోందని పేర్కొంది. విద్యార్థుల ప్రవేశాలు పూర్తిగా లేకపోవడంతో 27 కాలేజీలు స్వచ్ఛందంగా సున్నా(నిల్‌) అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపింది. మొదటి సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాని కాలేజీలకు నిబంధనల ప్రకారం అనుబంధ గుర్తింపు మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.


‘మీ అధికారులంతా సత్యహరిశ్చంద్రులా..?’: టీపీజేఎంఏ

ఇంటర్‌ బోర్డు వివరణపై తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) స్పందించింది. కొన్ని కాలేజీలు నకిలీ ఎన్‌వోసీలు సమర్పించింది వాస్తవమే అయితే.. ఎలాంటి పరిశీలన లేకుండా బోర్డు అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్‌ నిలదీశారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష తీరు చూస్తుంటే యాజమాన్యాలు మాత్రమే నేరస్థులని, బోర్డు అధికారులంతా ‘సత్య హరిశ్చంద్రులు’ అనే భ్రమలో ఉన్నట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. యాజమాన్యాలకు రూ. 8లక్షల వరకు జరిమానా విధిస్తున్న కార్యదర్శి.. ఏళ్లుగా అవినీతికి పాల్పడుతున్న బోర్డు అధికారులపై చర్య తీసుకునే ధైర్యం ఉందా ? ప్రశ్నించారు. ఇంటర్‌ బోర్డుపై తాను చేసిన ఆరోపణలన్నింటికీ ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, అవినీతి అధికారుల భాగోతం త్వరలో మీడియా ముందు బహిర్గతం చేస్తానని గౌరీ సతీష్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

సింగరేణిని కాపాడుకోవాలి

జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:19 AM