డిజిటల్ వేదికపై తాండూరు కందిపప్పు రైతులు
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:48 AM
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన తాండూరు కందిపప్పునకు ‘డిజిటల్ ట్రేసబిలిటీ’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
65 వేల మంది సాగుదారుల నమోదు
నకిలీ పప్పును గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు
‘డిజిటల్ ట్రేసబిలిటీ’ వ్యవస్థ అందుబాటులోకి..
హైదరాబాద్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన తాండూరు కందిపప్పునకు ‘డిజిటల్ ట్రేసబిలిటీ’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన తాండూరు కందిపప్పు అసలైన ఉత్పత్తిని గుర్తించటంతోపాటు నకిలీల విక్రయాలకు అడ్డుకట్ట వేయటం, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ ప్రాజెక్టు చేపట్టింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీజీటీఎస్) ద్వారా హైదరాబాద్‌కు చెందిన ట్రేసబిలిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాల సంస్థ ‘టీఆర్‌ఎ్‌సటీ01’కు బాధ్యతలు అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్ ఇన్ అగ్రికల్చర్ (ఎన్‌ఈజీపీఏ 2025-26)’ పరిధిలో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. తాండూరు కందిపప్పు సాగుచేసే నిర్దేశిత ప్రాంతంలోని సుమారు 65 వేల మంది రైతులను డిజిటల్ వేదికపై నమోదు చేస్తారు. ప్రతి రైతుకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపుతోపాటు వారి భూమి, సాగుచేసిన పంట, పంటకోత వివరాలతో ప్రొఫైల్ రూపొందిస్తారు. తద్వారా పంటను ఎవరు పండించారు? ఎక్కడ పండించారు? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పంట సాగు చేసిన పొలం నుంచి సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ, చివరకు కొనుగోలుదారుడికి చేరేవరకు తాండూరు కందిపప్పు ప్రయాణాన్ని డిజిటల్ వ్యవస్థ ద్వారా నమోదు చేస్తారు.
ఇప్పటివరకు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత పంటను పండించిన రైతుల వివరాలు గుర్తించలేని పరిస్థితి ఉంది. కొత్త విధానంలో ప్రతి సరుకు లాట్‌కు సంబంధించిన అసలు వివరాలను గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు తమ ఉత్పత్తిపై గుర్తింపు లభించటంతోపాటు మార్కెట్‌లో బేరసారాల సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మహిళా రైతుల భాగస్వామ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుంది. నకిలీ తాండూరు కందిపప్పును గుర్తించే అవకాశం ఉంటుంది. తాండూరు ప్రాంతానికి సంబంధించిన నమోదిత జీఐ భౌగోళిక పరిధిలో సాగుచేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
వ్యవసాయ భూముల మ్యాపింగ్ చేపట్టి, నమోదిత రైతులు, సాగు విస్తీర్ణం, పంటల వివరాలు జీఐ పరిధితో పోలుస్తారు. నిర్దేశిత ప్రాంతంలో పండించిన, ధ్రువీకరించిన ఉత్పత్తికే తాండూరు మూలానికి సంబంధించిన గుర్తింపు లభించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో పండించిన కందిపప్పును తాండూరు పేరుతో విక్రయించే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. తాండూరు కందిపప్పు తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తి కావడం తెలిసిందే. 2022 డిసెంబరులో జీఐ గుర్తింపు లభించింది. యాలాల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఈ గుర్తింపు కోసం దరఖాస్తుచేయగా... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి
మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్ జోష్
ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్!
Read Latest AP News And Telangana News And International