Share News

పారిశ్రామికవేత్తలకు బీఆర్‌ఎస్‌ బెదిరింపులు

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:25 AM

యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కవద్దనుకునే పార్టీ బీఆర్‌ఎస్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు.

పారిశ్రామికవేత్తలకు బీఆర్‌ఎస్‌ బెదిరింపులు
Duddilla Sridhar Babu

  • ఫ్యూచరే లేని బీఆర్‌ఎస్‌..

  • ఫ్యూచర్‌ సిటీపై మాట్లాడితే నవ్వొస్తోంది: మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కవద్దనుకునే పార్టీ బీఆర్‌ఎస్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా పారిశ్రామికవేత్తలను బెదిరిస్తోందని మండి పడ్డారు. తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై అసెంబ్లీలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఫ్యూచరే లేని బీఆర్‌ఎస్‌.. ఫ్యూచర్‌ సిటీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని పేర్కొన్నారు. గత సర్కారు ఫార్మాసిటీ పేరిట ఫ్యూచర్‌ సిటీలో తీవ్ర కాలుష్యం వెదజల్లే రెడ్‌ కేటగిరీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడితే.. తమ సర్కారు మాత్రం గ్రీన్‌ ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. టైర్‌-2 నగరాలు, పట్టణాలకు పారిశ్రామికాభివృద్ధి విస్తరణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నామని శ్రీధర్‌ బాబు తెలిపారు.


సాగుకి ఇచ్చాకే డేటా సెంటర్లకు కరెంటు

వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేసిన తర్వాతనే డేటా సెంటర్లకు కరెంటును ఇస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. మన డేటా మన దేశంలోనే ఉండాలన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్రంలో డేటా సెంటర్లను పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డేటా సెంటర్లు లేకుండా ఐటీ రంగాన్ని విస్తరించలేమని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు.


హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు.. నల్గొండ, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ లాంటి టైర్‌-2 నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరించే చర్యలను ముమ్మరం చేశామన్నారు. డేటా సెంటర్లు వద్దంటూ అమెరికాతో పాటు యూరోప్‌ దేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని, వీటి వల్ల నీటి, విద్యుత్‌ సమస్యలు వస్తాయని, పునరాలోచన చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాల కల్పన కూడా ఉండదన్నారు. డేటా సెంటర్లు అమెరికా లాంటి దేశాల్లో గుదిబండలాగా మారాయన్నారు. 30 ఏళ్ల కిందట రాష్ట్రంలో ఐటీ బూమ్‌ వచ్చిందని, ప్రస్తుతం ఐటీ రంగం సంక్షోభంలో ఉందని అన్నారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లు పూర్తిగా తగ్గిపోయాయని గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అనలాగ్‌ పనీర్‌పై నిషేధం
చెప్పినట్టు వినకుంటే.. కొలువు పీకేయిస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 06:25 AM