CM Revanth Reddy: సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చండి: సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 15 , 2026 | 09:22 PM
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో పలు రాష్ట్రాలలో.. ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లు మంజూరు చేశారని ఆర్మీ ఉన్నతాధికారులకు సీఎం వివరించారు.
హైదరాబాద్, జనవరి 15: ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరించుకునేందుకు మీ వైపు నుంచి కూడా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆర్మీ ఉన్నతాధికారులను ఆయన కోరారు. గురువారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ‘సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్’ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుందని వారికి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే వికారాబాద్‌లో.. లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు తమ ప్రభుత్వం 3 వేల ఎకరాలు కేటాయించిందని ఈ సందర్భంగా ఆర్మీ ఉన్నతాధికారులకు ఆయన గుర్తు చేశారు. అలాగే సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని వారిని కోరారు.
ఇక తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని వారికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో.. ఒక్క రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లు మంజూరు చేశారని ఆర్మీ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదన్నారు.
భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా ( తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ), డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు
పొంగల్ ఎఫెక్ట్.. ప్రయాణికులు లేక ఐదు ప్రత్యేక రైళ్ల రద్దు
For More TG News and National News