ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను దాటాం
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:45 AM
అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలోని షియర్ జోన్‌ను దాటిన తవ్వకాలు.. ఐదారు నెలల్లో సుమారు 700 మీటర్ల పురోగతి
అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి వచ్చే లోకోమోటివ్‌తో పనుల వేగం పెంపు
2028 జూన్ నాటికి నీటి సరఫరా లక్ష్యం
కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు4: అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలోని బలహీన శిలల మండలాన్ని(షియర్ జోన్) దాటడంతో పనుల వేగం పెంపునకు మార్గం సుగమమైందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టుల అమలుపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పురోగతిపై చర్చించారు.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించి, ఏళ్ల తరబడిగా ఉన్న నీటి కొరత సమస్యను తీర్చడమే లక్ష్యమని ఉత్తమ్ అన్నారు. అందువల్ల 2028 జూన్ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అదనపు యంత్రాలను రంగంలోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. పనుల్లో వేగంతోపాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. టన్నెల్-1లో రెండు వైపుల నుంచి సాగుతున్న తవ్వకాలు 2028 మే-జూన్ నాటికి కలిసే దశకు చేరుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన సొరంగంతోపాటు టన్నెల్-2, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇతర అనుబంధ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులనుఆదేశించారు.
ఐదారు నెలల్లో 700 మీటర్ల పురోగతి
గత ఐదారు నెలల్లో సొరంగం తవ్వకాల పనులు అవుట్‌లెట్ వైపు సుమారు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల కలిపి సుమారు 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం ఈ సమీక్షలో మంత్రికి వివరించింది. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిమీల మేర తవ్వకాలు మిగిలున్నాయని వివరించింది. సొరంగం పనులకు నేతృత్వం వహిస్తున్న భారత సైన్యానికి చెందిన సొరంగ నిర్మాణ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఇన్‌లెట్ వద్ద ఎదురైన పరిస్థితులను వివరించారు. సొరంగంలో మరో ప్రమాదం జరగకుండా తొలి నెలల్లో తవ్వకాల వేగాన్ని ఉద్దేశపూర్వకంగానే తగ్గించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు ఎనిమిది మీటర్ల మేర పురోగతి నమోదవుతోందని ప్రాజెక్టు బృందం తెలిపింది. అవుట్‌లెట్ వద్ద మూడు డ్రిల్లింగ్ భుజాలున్న బూమర్ యంత్రం ఇప్పటికే పని చేస్తోందని, ఇన్‌లెట్ వద్ద కూడా ఇదే తరహా మరో యంత్రం అక్టోబరులో అందుబాటులోకి రానుందని పేర్కొంది. జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజన్ (లోకోమోటివ్) అక్టోబరు నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని వినియోగంతో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని, తద్వారా ఒక్కో దఫా పనికి పట్టే సమయం తగ్గుతుందని వివరించారు. సుమారు 7.1 కిమీల పొడవున్న టన్నెల్-2లో సుదీర్ఘ విరామం తర్వాత లైనింగ్ పనులు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. అవసరమైన యంత్రాలను సమకూర్చాలని మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక
ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడే..
పెరిగిన సేవలు.. సరిపోని సిబ్బంది
Read Latest AP News And Telugu News