ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడే..
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:30 AM
ఓటరు జాబితా నుంచి పౌరుల ఓట్లను తొలగించటం అంటే రాజ్యాంగంపై దాడి చేయటమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. మూకుమ్మడిగా ఓట్లను తొలగించటం దేశంలోని పౌరులను రెండు వర్గాలుగా విభజిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
మూకుమ్మడిగా ఓట్లు తొలగించే అధికారం ఎవరికీ లేదు
అలాంటి చర్యను ఏ న్యాయస్థానమూ సమర్థించలేదు
ఓటును తొలగించడం అంటే శరీరం నుంచి ఆత్మను వేరుచేయడమే
ఓట్లు తొలగిస్తే దేశంలో రెండు రకాల పౌరులు తయారవుతారు
ఓట్లు ఉన్నవారు మొదటిస్థాయి, లేనివారు రెండోస్థాయి పౌరులవుతారు
నల్సార్ వర్సిటీలో సుప్రీం జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 4: ఓటరు జాబితా నుంచి పౌరుల ఓట్లను తొలగించటం అంటే రాజ్యాంగంపై దాడి చేయటమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. మూకుమ్మడిగా ఓట్లను తొలగించటం దేశంలోని పౌరులను రెండు వర్గాలుగా విభజిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఆదివారం ‘19వ నల్సార్-జస్టిస్ బీఆర్ సానీ మెమోరియల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్’లో కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా దేశంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఓటరు జాబితా నుంచి మూకుమ్మడిగా పౌరుల ఓట్లను తొలగించి, ఓటు హక్కును నిరాకరించటం రాజ్యాంగ విరుద్ధం. ఇలా చేయటానికి ఎవరికీ అధికారం లేదు. దీనిని ఏ కోర్టూ సమర్థించలేదు. దేశంలో పౌరులను ఓటు ఉన్నవారు, ఓటు లేనివారు అంటూ రెండు వర్గాలుగా రాజ్యాంగం విభజించలేదు. లక్షలకొద్దీ ఓట్లను తొలగించి సొంత దేశంలోనే పౌరులను రెండో జాతివారిగా మర్చే ఏ ప్రక్రియ అయినా చట్ట విరుద్ధమైనదే. ఆ ప్రక్రియ రాజ్యాంగ హృదయంపై దాడే అవుతుంది. ఇలా మూకుమ్మడిగా ఓట్లను తొలగించటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు), ఆర్టికల్ 326 (ఎన్నికల్లో భాగస్వామి అయ్యే హక్కు)లను ఉల్లంఘించటమే.
భారత పౌరసత్వ విధానం ప్రకారం ఎన్నికల్లో ఓటు వేసే హక్కును, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొనే హక్కును పౌరుడి నుంచి ఎవరూ వేరు చేయటానికి వీలు లేదు. అలా చేస్తే శరీరం నుంచి ఆత్మను వేరు చేయటమే అవుతుంది. ఆర్టికల్ 326ను మార్చటం వీలు కాదు. ఏ అధికార వర్గానికిగానీ, వ్యక్తికిగానీ ఆ అధికారం లేదు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు. మరణించినవారివి తప్ప బతికి ఉన్న అర్హులైన పౌరుల ఓట్లను తొలగించటం కుదరదు. ఒకసారి ఓటరు లిస్టులో ఓటు నమోదైన తర్వాత ఆ ఓటరుకు నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా తొలగించలేరు’ అని పేర్కొన్నారు. ఓటు హక్కుపై అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫెలెక్స్ ఫ్రాంక్‌ఫర్ట్ అభిప్రాయాలను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గుర్తు చేశారు. ‘ఒక ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత అధికారం ఉండేది ఆ దేశాధ్యక్షుడి కార్యాలయానికి కాదు.. ఆ దేశంలోని పౌరుడికి’ అన్న ఫ్రాంక్‌ఫర్ట్ వ్యాఖ్యలను ఉదహరించారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటు హక్కు కల్పించటానికి అవసరమైన పత్రాలు సమర్పించలేని పౌరుల ఓట్లను తొలగించే అధికారం ఈసీకి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఇవి కూడా చదవండి...
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!
Read Latest AP News And Telugu News