ఏఐ.. రెండో టీచర్!
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:37 AM
చదువులో ఏదైనా సందేహం వస్తే.. ఒకప్పుడు విద్యార్థులు టీచర్‌ని అడిగేవారు! ఇంకా ఆసక్తి ఉంటే గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తిరగేసేవారు. ఆ క్రమంలో వారికి జవాబు తెలియడమే గాక, ఆలోచనా శక్తి పెరిగేది.
కృత్రిమ మేధ వాడకంలో ముందుంటున్న విద్యార్థులు
డౌట్ వచ్చిందా? టీచర్ దగ్గరకు కాదు.. ఏఐ దగ్గరకే
హోంవర్క్ పూర్తి.. కానీ విషయం అర్థమవుతోందా?
ఏఐ జవాబిస్తుందిగానీ ఆలోచించడం నేర్పేదెవరు?
పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని
తల్లిదండ్రులకు టెక్ నిపుణులు, విద్యావేత్తల సూచన
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): చదువులో ఏదైనా సందేహం వస్తే.. ఒకప్పుడు విద్యార్థులు టీచర్‌ని అడిగేవారు! ఇంకా ఆసక్తి ఉంటే గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తిరగేసేవారు. ఆ క్రమంలో వారికి జవాబు తెలియడమే గాక, ఆలోచనా శక్తి పెరిగేది. కానీ కృత్రిమ మేధ వచ్చాక సీన్ మారిపోయింది. టీచర్ క్లాస్‌లో పాఠం చెప్పి, దానికి సంబంధించిన హోం వర్క్ ఇస్తే.. దాన్ని పూర్తిచేసే క్రమంలో వచ్చే సందేహాలు తీర్చుకోవడానికి ఏ చాట్‌జీపీటీనో, జెమినైనో ఆశ్రయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ.. విద్యార్థికి ‘సెకండ్ టీచర్’గా మారింది. కృత్రిమ మేధ (రెండో టీచర్) ఎప్పుడూ అందుబాటులో ఉండడం.. సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏమడిగినా సమాధానం చెబుతుండడంతో చాలా మంది విద్యార్థులు తమ సందేహాలు తీర్చుకోవడానికి ఏఐనే ఆశ్రయిస్తున్నారు.
తమకిచ్చిన హోం వర్క్‌ను ఏఐ టూల్స్ సాయంతోనే పూర్తిచేసేస్తున్నారు. కానీ అసలు చిక్కు అక్కడే ఉంది. ఏఐ ఇచ్చిన జవాబు రాసేసి హోం వర్క్ పూర్తయిందనిపించుకుంటే.. వారికి విషయం ఎలా అర్థమవుతుంది? ఆ అంశంపై వారికి పూర్తి అవగాహన ఎలా వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు. అన్నింటికీ మించి.. కొన్నికొన్నిసార్లు ఏఐ తనకు జవాబు తెలియకపోయినా, ఏదో ఒక జవాబు ఇచ్చేస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో.. ఏఐ ఇచ్చిన జవాబు సరైనదా? కాదా? అనే విషయాన్ని ఎలా నిర్ధారించుకోవాలో చాలామంది విద్యార్థులకు తెలియట్లేదు. ఒకవేళ అదిచ్చిన జవాబు సరైనదే అయినా.. అసలు ఆ సమాధానం ఎలా వచ్చిందో, దాని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కొందరు చేయట్లేదు. గుడ్డిగా అదిచ్చిన జవాబులను హోంవర్క్‌లో రాసేసి టీచర్‌కు చూపుతున్నారు.
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల అనుభవాలు, చదువు, వెల్‌బీయింగ్, ప్రేరణ, భవిష్యత్ సన్నద్ధత వంటి అంశాలపై జెట్రి అనే సంస్థ నిర్వహించిన స్టూడెంట్ సింక్ ఇండెక్స్ -2026 అధ్యయనం ఏఐ వినియోగానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. చదువుకోసం 33 శాతం మంది విద్యార్థులు తరచుగా ఏఐని ఉపయోగిస్తుండగా.. మరో 28 శాతం మంది అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నారు. అంటే సగానికిపైగా విద్యార్థుల చదువులో ఏఐ ఇప్పటికే ఒక భాగంగా మారిపోయిందన్నమాట. కానీ విద్యార్థులకు ఏఐని ఎలా ఉపయోగించాలో నేర్పుతున్న ఉపాధ్యాయులు కేవలం 12 శాతమే అని అధ్యయనం చెబుతోంది. అంటే విద్యార్థి చేతిలో ఏఐ ఉంది.. దాన్ని ఉపయోగించే ఆసక్తి ఉంది.. కానీ ఆ ఏఐని సరైన విధంగా ఉపయోగించడం, దాని సమాధానాలను ఎలా పరిశీలించాలి, అదిచ్చే జవాబుల్లో ఏది నిజమో, ఎంత నిజమో.. ఏది తప్పో ఎలా గుర్తించాలి అనే విషయాల్లో మార్గనిర్దేశం చేసే వ్యవస్థ మాత్రం ఇంకా అంతగా సిద్ధం కాలేదు.
ఏఐ చెప్పిన ప్రతి మాటనూ నమ్మొచ్చా? ఏఐతో హోంవర్క్ చేయించుకోవడం, ఏఐ ద్వారా విషయాన్ని నేర్చుకోవడం మధ్య తేడా ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన వ్యవస్థ వెనకబడే ఉంది. ఒక విద్యార్థి ఏఐని అడిగి ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాడు. ఆ సమాధానానికి సంబంధించి ఇంకో సందేహం వచ్చింది. దాని గురించి వివరించాలని ఏఐనే అడిగాడు. అక్కడితో ఆగకుండా మరో ప్రశ్న వేశాడు. ఇలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ విద్యార్థి.. విషయం లోతుల్లోకి వెళ్లిపోయాడు. ఇలా కొందరు విద్యార్థులు.. తరగతిగదిలో టీచర్ చెప్పిన దానికంటే కూడా ముందుకు వెళ్తున్నారు. ‘టీచర్.. ఏఐ ఇలా చెప్పిందేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో.. ఉపాధ్యాయులూ కొత్త టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఏఐ మంచిదే.. కానీ ‘ఎలా’ అన్నదే కీలకం!
పరిమితుల్లో, బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే.. విద్యార్థులకు కృత్రిమ మేధ టూల్స్ ఎంతో ఉపయోగపడతాయని టెక్ నిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, పరిమితులపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. ఏఐని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లలకు మార్గనిర్దేశం చేయాలని పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించే పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, ఏఐ సాధనాల వినియోగంపైనా తగిన పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల
బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులన్నింటికీ కలిపి సమగ్ర చికిత్స
Read Latest AP News And Telugu News