Share News

రూ.10వేలు కడితే రూ.లక్ష రుణం

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:56 AM

పదిమంది మహిళలు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.వెయ్యి చొప్పున రూ.10 వేలు చెల్లిస్తే రూ.లక్ష రుణమిస్తామని పుంగనూరు ప్రాంతంలో కొందరు ఏజెంట్లు డబ్బు వసూలు చేసి, మోసం చేశారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు.

రూ.10వేలు కడితే రూ.లక్ష రుణం
లోన్లు ఇప్పిస్తామంటూ సూర్యశక్తి మహిళా సంఘం పేరిట ముద్రించిన కరపత్రాలు

- పుంగనూరులో మహిళల నుంచి డబ్బు వసూలు

- ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో లబోదిబోమంటున్న బాధితులు

పుంగనూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పదిమంది మహిళలు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.వెయ్యి చొప్పున రూ.10 వేలు చెల్లిస్తే రూ.లక్ష రుణమిస్తామని పుంగనూరు ప్రాంతంలో కొందరు ఏజెంట్లు డబ్బు వసూలు చేసి, మోసం చేశారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం నుంచి పుంగనూరు పట్టణం, మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొందరు ఏజెంట్లు పర్యటించి మైక్రో ఫైనాన్స్‌ ద్వారా రూ.లక్ష రుణం ఇస్తామని, ఇందులో వితంతువులు ఉంటే రుణంలో 25శాతం సబ్సిడీ ఉంటుందని విస్తృత ప్రచారం చేశారు. సూర్యశక్తి మహిళా సంఘం లోన్స్‌ పేరిట కరపత్రాలు పంపిణీ చేసి తమ బ్రాంచ్‌లు విజయవాడ, తిరుపతి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరులో ఉన్నాయని నమ్మించారు. మైక్రోఫైనాన్స్‌ ద్వారా రూ.1.80లక్షలు, రూ.లక్ష, రూ.80 వేలు సులభంగా పొందవచ్చునని, తీసుకున్న రుణాన్ని బట్టి కంతులు చెల్లించాలని ఏజెంట్లు సూచించారు. పూచీకత్తు లేకుండా రూ.లక్ష రుణం వస్తుందని ఆశపడిన మహిళలు గ్రూపులుగా ఏర్పడి రూ.10వేలు చొప్పున చెల్లించి నెలరోజులైనా రుణం ఇవ్వకుండా వాయిదాలు వస్తూ కాలం గడుపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేశారని వాపోతున్నారు.

గతంలో రూ.7కోట్లకు బోర్డు తిప్పేసిన లిల్లీ ఇన్వె్‌స్టమెంట్‌

2023 ఆగస్టులో పుంగనూరు కొత్తఇండ్లులో లిల్లీ లోన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌కు సంబంధించి కార్యాలయాన్ని హంగులతో ఏజెంట్‌ నౌహిరా ప్రారంభించి ఒక వ్యక్తి రోజుకు రూ.543 చెల్లిస్తే డబ్బు రెట్టింపవుతుందని ప్రచారం చేశారు. ప్రతి ఏజెంటు 20 మంది సభ్యులను చేర్పించి డబ్బులు డిపాజిట్‌ చేయిస్తే వారికి కమీషన్‌తో పాటు ప్రతినెలా రూ.వెయ్యి వేతనం ఉంటుందని పేర్కొన్నారు. పుంగనూరు, మదనపల్లె, సోమల, చౌడేపల్లె, పలమనేరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.7 కోట్లు కట్టించారు. పుంగనూరులోనే మూడువేల మందికి పైగా సభ్యులు డబ్బులు కట్టారు. 2024 జనవరిలో లిల్లీ ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ నుంచి డబ్బులు రాకపోవడం, కట్టిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు బోర్డు తిప్పేశారు.

మేము ఎవరి వద్దా డబ్బు వసూలు చేయలేదు

పీలేరులో ఉన్న సూర్యశక్తి మహిళా సంఘం లోన్స్‌ కంపెనీ పుంగనూరు ప్రాంతంలో ఏ మహిళా సంఘం వద్ద డబ్బు వసూలు చేయలేదని సంస్థ ప్రతినిధి భాస్కర్‌ తెలిపారు. తాము కన్సెల్టెన్సీగా అవసరమైన వారికి మా కార్యాలయానికి పిలిపించి ఇన్సూరెన్స్‌ చేయించి తర్వాత బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తాము డబ్బు తీసుకుని ఉంటే రసీదులు ఇస్తామన్నారు. పీలేరు, సోమల, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లో తమ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు.

Updated Date - Oct 05 , 2026 | 12:56 AM