బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులన్నింటికీ కలిపి సమగ్ర చికిత్స
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:28 AM
బీపీ, షుగర్ సమస్యలుంటే జనరల్ ఫిజీషియన్, ఎండోక్రైనాలజిస్టులను సంప్రదిస్తాం! కిడ్నీ జబ్బులుంటే నెఫ్రాలజీ నిపుణుల వద్దకు వెళ్తాం. కానీ.. అలా వేర్వేరుగా చికిత్సలు చేయించుకోవడం కంటే మూడింటికీ కలిపి సమగ్ర చికిత్స చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఈ 3 సమస్యలున్నవారు పదేళ్లలో హృద్రోగంతో చనిపోయే ముప్పు 30-50 శాతం
దేశంలో ఏటా 25 లక్షల మంది మృత్యువాత
భారతీయుల శరీరతత్వానికి అనుగుణంగా కొత్త కొలతలు, స్ర్కీనింగ్ పద్ధతులు
‘వారణాసి డిక్లరేషన్ 2026’ ముసాయిదా.. ‘ది లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురణ
ప్రాణాధార ఔషధాలను నిత్యావసర జాబితాలో చేర్చాలని అందులో స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): బీపీ, షుగర్ సమస్యలుంటే జనరల్ ఫిజీషియన్, ఎండోక్రైనాలజిస్టులను సంప్రదిస్తాం! కిడ్నీ జబ్బులుంటే నెఫ్రాలజీ నిపుణుల వద్దకు వెళ్తాం. కానీ.. అలా వేర్వేరుగా చికిత్సలు చేయించుకోవడం కంటే మూడింటికీ కలిపి సమగ్ర చికిత్స చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు, కిడ్నీ జబ్బులు.. ఈ మూడూ ఉన్నవారు పదేళ్లలో గుండె జబ్బుతో చనిపోయే ముప్పు 30 నుంచి 50 శాతం దాకా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటినీ కలిపి ‘కార్డియోవాస్కులర్- కిడ్నీ- మెటబాలిక్’ (సీకేఎం) సిండ్రోమ్‌గా పరిగణించి.. సమగ్ర చికిత్స అందించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు.. కార్డియాబ్‌కాన్ సొసైటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 50 మంది వైద్య నిపుణులు ఏకాభిప్రాయంతో రూపొందించిన ‘వారణాసి డిక్లరేషన్ 2026’ విధాన పత్రం అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ - సౌత్‌ఈస్ట్ ఆసియా’లో ప్రచురితమైంది.
రోగనిర్ధారణ, చికిత్సా విధానాలు, ఔషధాల అభివృద్ధి విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న విదేశీ ప్రమాణాలు.. మన శరీర తత్వానికి సరిపోవని, భారతీయ పరిస్థితులకు తగ్గట్లుగా అవన్నీ ఉండాలని ఆ పత్రం స్పష్టం చేసింది. మన దేశంలో ప్రస్తుతం 10.1 కోట్ల మంది మధుమేహంతో, 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ (మధుమేహం రావడానికి ముందు దశ)తో బాధపడుతున్నారు. దాదాపు 20 కోట్ల మందికి పైగా రక్తపోటు బాధితులుండగా.. జనాభాలో సుమారు 17 శాతం మంది కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నారు. దేశంలో ఏటా సుమారు 25 లక్షల మంది.. అదీ పనిచేసే వయసులో ఉన్నవారు వీటన్నింటి బారిన పడడం వల్లే అకాల మరణం చెందుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం మన ఆరోగ్య వ్యవస్థలో ఈ జబ్బులకు వేర్వేరు నిపుణులు వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు తప్ప సమగ్ర పర్యవేక్షణ ఉండటం లేదు. వీటి బారిన పడినవారి ప్రాణాలను కాపాడే మూడు కీలక ఔషధాలైన రెనిన్-యాంజియోటెన్సిన్ బ్లాకర్స్, ఎస్జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు, స్టాటిన్లను కలిపి తీసుకుంటున్న రోగులు 20 శాతం కంటే తక్కువగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.
భారతీయుల్లో థిన్-ఫ్యాట్ ముప్పు..
పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయులలో థిన్-ఫ్యాట్ శరీర తత్వం ఎక్కువగా కనిపిస్తుం ది. అంటే శరీరం పైకి సాధారణ బరువుతో సన్నగా కనిపించినప్పటికీ, అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోయి తక్కువ వయసులోనే ఇన్సులిన్ నిరోధకత, గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. అందువల్ల పాశ్చాత్య బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కొలతలు భారతీయులకు సరిపోవు. మన దేశానికి బీఎంఐ 23 దాటితే అధిక బరువుగా, 27.5 దాటితే స్థూలకాయంగా పరిగణించాలని నిపుణులు నిర్ణయించారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెం.మీ, స్త్రీలలో 80 సెం.మీ దాటినా, ఎత్తుతో పోలిస్తే నడుము నిష్పత్తి 0.5 దాటినా ప్రమాదకరంగా గుర్తించాలని పేర్కొన్నారు. కిడ్నీ పనితీరును అంచనా వేసేందుకు రక్తంలో ఈజీఎఫ్ఆర్ లెక్కించడంతో పాటు, మధుమేహం, బీపీ ఉన్న ప్రతి ఒక్కరికీ కచ్చితమైన యూరిన్ ఆల్బుమిన్-క్రియాటినైన్ రేషియో (యూఏసీఆర్) పరీక్ష తప్పనిసరిగా చేయాలని సూచించారు. వంటగది వాయు కాలుష్యాన్ని కూడా మెటబాలిక్ ముప్పు కారకంగా గుర్తించాలని.. అమెరికాకు చెందిన రిస్క్ కాలిక్యులేటర్లకు బదులుగా భారతీయుల సమాచారంతో ఇండియా-ప్రివెంట్ పేరిట ప్రత్యేక రిస్క్ అసె్‌సమెంట్ వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదించారు.
ఆ ఔషధాలు.. అందరికీ అందుబాటులో..
శరీరంలోని కీలక అవయవాలను రక్షించే అత్యాధునిక ఔషధాలైన ఎస్జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు, జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్టులను ప్రభుత్వం వెంటనే జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో చేర్చాలని కమిటీ ఏకగ్రీవంగా కోరింది. పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, పల్లెల్లోని పేద రోగులకు కూడా ఇవి అందుబాటులో ఉండేలా జెనరిక్ ప్రిస్ర్కిప్షన్, ప్రభుత్వ ఉమ్మడి కొనుగోలు విధానాలను అమలు చేయాలని పేర్కొంది. ఈ కార్యాచరణను దేశవ్యాప్తంగా మూడంచెల్లో అమలు చేయాలని వైద్యనిపుణులు ప్రతిపాదించారు. అందులో భాగంగా.. మొదటి దశలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల్లో 35 ఏళ్లు దాటిన వారికి (కుటుంబ చరిత్ర ఉంటే 25 ఏళ్లకే) స్ర్కీనింగ్ నిర్వహించి ఎస్జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లను ఇవ్వడం ప్రారంభించాలి. రెండో దశలో జిల్లా ఆసుపత్రుల్లో ఇంటిగ్రేటెడ్ సీకేఎం క్లినిక్‌ల ద్వారా కార్డియాలజీ, నెఫ్రాలజీ వైద్యుల సమన్వయంతో ఫినెరెనోన్, జీఎల్‌పీ-1 మందులను ఇవ్వాలి. మూడో దశలో బోధనాసుపత్రుల్లో ప్రత్యేక ఫెలోషిప్ శిక్షణ, నాణ్యత ఆడిట్ నిర్వహించాలి. దీని కోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) ఆధారిత సీకేఎం పేషెంట్ పాస్‌పోర్టును అనుసంధానించాలని, దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో 50 వేల మంది రోగులతో ఇండియా సీకేఎం రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని వారణాసి డిక్లరేషన్ ప్రభుత్వానికి సూచించింది.
ప్రాథమిక కేంద్రాల్లోచౌకగా పరీక్షలు
ఖరీదైన ప్రయోగశాలలు, నిరంతర విద్యుత్ లేని గ్రామీణ ప్రాంతాల్లో.. అత్యంత చౌకగా లభించే పరికరాలతో వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచించారు. డిజిటల్ బీపీ మిషన్, గ్లూకోమీటర్, పీక్ ఎక్స్‌రేటరీ ఫ్లో రేట్ (పీఈఎ్‌ఫఆర్)ను చూసే చిన్న హ్యాండ్‌హెల్డ్ మీటర్‌ను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించాలని.. ప్రాథమిక కేంద్రాల్లోనే ఈ పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. కొన్ని వందల రూపాయలకే లభించే పీఈఎ్‌ఫఆర్ మీటర్ ద్వారా శ్వాస సామర్థ్యంతో పాటు కండరాల బలహీనత, అంతర్గత వాపు (ఇన్‌ఫ్లమేషన్), నరాల పనితీరును అంచనా వేయడానికి వీలవుతుందని తెలిపారు. యోగా, ప్రాణాయామం ద్వారా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల
ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం
Read Latest AP News And Telugu News