Share News

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:43 AM

నవంబరులో ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు కోసం తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును కాంగ్రెస్‌ పార్టీ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!
Pavithravani

  • కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుమార్తె పేరును పరిశీలిస్తున్న కాంగ్రెస్‌

  • ఆమె ప్రస్తుతం వైద్యవృత్తిలో..

  • పద్మశాలిని ఎమ్మెల్సీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): నవంబరులో ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు కోసం తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును కాంగ్రెస్‌ పార్టీ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆమె వైద్యవృత్తిలో ఉన్నారు. మూడు ఎమ్మెల్సీ సీట్లలో ఒక సీటును పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వనున్నట్లుగా సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కొండా లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ ఉద్యమకారులతో పాటుగా పద్మశాలి వర్గానికి చెందినవారూ ఓన్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడి కుటుంబసభ్యురాలు, పైగా పద్మశాలి సామాజిక వర్గం కావడంతో పవిత్రవాణి పేరును గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీకి సిఫారసు చేసే అంశంపై పరిశీలన జరుగుతోంది.


తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నాయకుడిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీకి పేరుంది. ఆయన భౌతికకాయాన్ని కూడా ప్రజల సందర్శనార్థం కాచిగూడలోని పద్మశాలి భవన్‌లోనే ఉంచారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారులను, వారి కుటుంబాలను కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించిందని టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయ్యాక కోదండరామ్‌ను ఎమ్మెల్సీ చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి వివిధ కార్పొరేషన్లలో పదవులూ ఇచ్చారు.


శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్‌ సభ్యురాళ్లుగా తీసుకున్నారు. తాజాగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ కూతురు పవిత్రవాణి పేరునూ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాపూజీ కుమార్తెను ఎమ్మెల్సీగా తీసుకుంటే బీసీ సామాజిక వర్గాల్లోను, ప్రత్యేకించి పద్మశాలి సామాజిక వర్గంలో.. మహిళల్లో సానుకూలత ఏర్పడుతుందన్న అంచనాలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలోనే ఉద్యమ నేపథ్యం, సీనియారిటీ కలిగిన పద్మశాలి సామాజిక వర్గ నేతలు తమ వంతుగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...
ఏఐ.. రెండో టీచర్‌!

రూ.10వేలు కడితే రూ.లక్ష రుణం

బీపీ, షుగర్‌, కిడ్నీ వ్యాధులన్నింటికీ కలిపి సమగ్ర చికిత్స

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 04:43 AM