ఒకే ఆస్తి.. ఒకే బిల్లు
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:51 AM
హైదరాబాద్ మహా నగరంలో పౌర సేవల్లో ఉన్న అనేక చిక్కులకు, అధికార వ్యవస్థల మధ్య ఉన్న అంతులేని సమన్వయ లోపాలకు ఇకపై తెరపడనుంది. అన్ని మున్సిపల్ సేవలకు ఒకే ఏకీకృత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
ఆస్తిపన్ను, నీరు, పారిశుధ్య సేవలకు ‘క్యూర్-1’ బిల్లు
ప్రతి ఆస్తికీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్
హైదరాబాద్‌లో పౌర సేవల్లో చిక్కులకు సరికొత్త ‘క్యూర్’
అమల్లోకి వచ్చిన కోర్ అర్బన్ రీజియన్ చట్టం-2026
ఆస్తుల రిజిస్ట్రేషన్‌తోపాటే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ కూడా..
ఆస్తిపన్ను మదింపులో మరింత స్పష్టత, సరళత
రోడ్లు, ట్రాఫిక్, చెరువుల ఆక్రమణ, విపత్తులపై నిర్ణయాలకు
ఏకీకృత వ్యవస్థ.. సీఎం నేతృత్వంలో క్యూర్ అపెక్స్ కౌన్సిల్
త్వరలో నైట్ ఎకానమీ జోన్లను ప్రకటించనున్న ప్రభుత్వం
హైదరాబాద్/సిటీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహా నగరంలో పౌర సేవల్లో ఉన్న అనేక చిక్కులకు, అధికార వ్యవస్థల మధ్య ఉన్న అంతులేని సమన్వయ లోపాలకు ఇకపై తెరపడనుంది. అన్ని మున్సిపల్ సేవలకు ఒకే ఏకీకృత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆస్తిపన్నుకు ఒకబిల్లు, తాగునీటి సరఫరాకు ఒక బిల్లు, పారిశుధ్య సేవలకు మరో బిల్లు జారీచేసే సమస్యలకు ‘క్యూర్-1’ పరిష్కారం చూపనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026’ ఈ నెల 2వ తేదీన అమల్లోకి వచ్చింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తిచే ఈ చట్టంతో ఈ ప్రాంతంలో పరిపాలనా విధానం పూర్తిగా మారిపోనుంది. ఇంటి కొనుగోలు తర్వాత మ్యుటేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాన్ని కొత్త చట్టం తగ్గించనుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ కూడా ఆటోమెటిక్‌గా పూర్తవుతుంది. ప్రతి ఆస్తికి ‘ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్’ ఇస్తారు. ఆస్తికి సంబంధించిన మున్సిపల్ వివరాలన్నీ ఈ గుర్తింపు సంఖ్యతో అనుసంధానమవుతాయి. ఆస్తిపన్ను, నీటి బిల్లు, మురుగునీరు, పారిశుద్ధ్య సేవల చార్జీలు కలిపి ‘క్యూర్-1’ పేరుతో ఒకే బిల్లు ఇస్తారు. మున్సిపల్ సేవలు, అనుమతులు, లైసెన్సులను ఒకే పోర్టల్ ద్వారా పొందే విధానం అమలుకానుంది.
అన్ని నిర్ణయాలకు ఒకే వేదిక
దాదాపు 70 ఏళ్ల నాటి జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన క్యూర్ చట్టంతో నగరంలో పౌర సేవలు మరింత సమర్థవంతంగా అందించే అవకాశం ఏర్పడింది. ఈ చట్టం ద్వారా ఏర్పాటుచేసే ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ నేరుగా ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. నగరాభివృద్ధి ప్రాధాన్యాలను ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. కార్పొరేషన్లు, పోలీస్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్, మెట్రోరైలు, ఆర్టీసీ, హైడ్రా తదితర విభాగాల అధికారులు ఈ వేదికపై ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. 1955లో పాత మున్సిపల్ చట్టం వచ్చినప్పుడు హైదరాబాద్ జనాభా సుమారు 15 లక్షలు.
ఇప్పుడు క్యూర్‌లో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. నగరం భారీగా విస్తరించింది. వరదలు, ఎండలు, వాయు కాలుష్యం, నీటి కొరత, ట్రాఫిక్, చెరువులు, నాలాల ఆక్రమణ, ఎత్తయిన భవనాల్లో అగ్నిప్రమాదాల వంటి కొత్త సవాళ్లు వచ్చాయి. అందుకు అనుగుణంగా నగర పాలనా వ్యవస్థను మార్చేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. మూడు కార్పొరేషన్ల ప్రస్తుత సరిహద్దులు మాత్రం మారవు. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ, కమిషనర్, వార్డు కమిటీ వ్యవస్థ కొనసాగుతుంది. ఐదేళ్ల పదవీకాలం కూడా యథాతథంగా ఉంటుంది.
భవన అనుమతుల్లో ఆలస్యానికి చెక్
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో సాగనుంది. నిర్ణీత సమయంలో అధికారులు దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోతే అది పైస్థాయికి వెళ్తుంది. నిర్ణయం వెలువడని సందర్భాల్లో డీమ్డ్ అప్రూవల్‌కు చట్టం అవకాశం కల్పిస్తోంది. లైసెన్సింగ్ విధానాన్ని కూడా సులభతరం చేశారు. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం వ్యాపార కార్యకలాపాలు కొనసాగే నైట్‌ఎకానమీ జోన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. చిన్న ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు పెట్టే పాత విధానాన్ని తొలగించి సివిల్ జరిమానాలు విధిస్తారు. ఒక శాఖ వేసిన రోడ్డును మరో శాఖ కొద్ది రోజులకే తవ్వే పరిస్థితులకు చెక్ పెట్టేలా కొత్త వ్యవస్థ ఉంటుంది. ‘యుటిలిటీ కోఆర్డినేషన్ కమిటీ’ రోడ్డు తవ్వకాలపై శాఖల మధ్య సమన్వయం చేస్తుంది. ట్రాఫిక్ నిర్వహణకు ‘క్యూర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ ేసఫ్టీ అథారిటీ’ పని చేస్తుంది. చెరువులు, నాలాలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. నిర్దేశిత విస్తీర్ణం దాటిన భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. పర్యావరణహిత చర్యలు తీసుకునే ఆస్తులకు ఆస్తిపన్ను రాయితీ ఇచ్చే అవకాశాన్ని చట్టంలో చేర్చారు.
విపత్తులకు శాశ్వత ప్రణాళిక..
కోర్ అర్బన్ రీజియన్ మొత్తానికి ఒకే విపత్తు నిర్వహణ ప్రణాళిక ఉంటుంది. ‘క్యూర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ విపత్తుల నివారణ, ముందస్తు సన్నద్ధత, ప్రతిస్పందన, పునరుద్ధరణ చర్యలను సమన్వయం చేస్తుంది. హైడ్రా విపత్తు ప్రతిస్పందన సంస్థగా పనిచేస్తుంది. నిర్దేశిత ఎత్తు దాటి నిర్మించే భవనాలకు ఫైర్ ఆడిట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే అవకాశం ఉంటుంది. మార్కెట్లు, రవాణా ప్రాంతాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల నిఘాకు చట్టం ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, చిన్నారులు, వృద్ధుల అవసరాలను నగర మౌలిక వసతుల్లో పరిగణనలోకి తీసుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. ‘జెండర్ ఇన్‌క్లూజన్ సెల్’ ఏర్పాటు చేస్తారు. ప్రతి కార్పొరేషన్‌లో ట్రాన్స్‌జెండర్ సమాజం నుంచి ఒకరికి ప్రాతినిధ్యం ఉంటుంది. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు విశ్రాంతి ప్రదేశాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, పార్కింగ్, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేేస అవకాశం ఉంది. వీధి వ్యాపారులకు వెండింగ్ జోన్లలో మౌలిక సదుపాయాలు అందించవచ్చు.
ఆస్తిపన్నుపై మరింత స్పష్టత
క్యూర్ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ట్రై కార్పొరేషన్లలో ఆస్తి పన్ను విధానం మారనుంది. ప్రాంతాలవారీగా మిశ్రమ విలువ (కాంపోజిట్ వాల్యూ)ను రిజిస్ట్రేషన్ల శాఖ ఖరారు చేసింది. భూమి విలువ, నిర్మాణ వ్యయం ఆధారంగా మిశ్రమ విలువను నిర్ధారించినట్టు అధికారులు తెలిపారు. చట్టం అమలులోకి వచ్చిన 2వ తేదీ నుంచి కొత్తగా మదింపు చేస్తోన్న ఆస్తులకు నూతన విధానం వర్తిస్తుంది. ఇప్పటివరకు పూర్వ జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్షిక అద్దె/యూనిట్ రేట్ ఆధారంగా పన్ను మధింపు జరిగింది. ఇక నుంచి మూలధన విలువ ప్రామాణికం కానుంది. ఇప్పటికే మధింపు జరిగిన ఆస్తులకు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి పన్ను పెరుగనుంది. మిశ్రల విలువ ఆధారంగా పన్ను నిర్ధారించి.. పెరిగిన మొత్తాన్ని ఏడాదికి 10 శాతం మించకుండా వసూలు చేస్తారు.
ఉదాహరణకు అమీర్‌పేటలో సబ్‌రిజిస్ట్రార్ విలువ ప్రకారం భూమి ధర చదరపు గజానికి రూ.50 వేలు.. నిర్మాణ వ్యయం రూ.1,500 ఉందనుకుందాం. 150 చదరపు గజాల స్థలంలో 1,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంటే... ఆస్తి మూలధన విలువ రూ.94,50,000. నివాస క్యాటగిరీ అయితే మొత్తం విలువలో 0.15 శాతం అంటే రూ.14,175 పన్నుగా నిర్ధారిస్తారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రాంతాలవారీగా చదరపు అడుగు మిశ్రమ విలువ (భూమి ధర, నిర్మాణ వ్యయం కలిపి) నిర్ధారించింది. ఉదాహరణకు ఖైరతాబాద్‌లో చదరపు అడుగు మిశ్రమ విలువ రూ.4,000.. నిర్మాణ విస్తీర్ణం 3,000 చదరపు అడుగులు.. మూలధన విలువ రూ.1.20 కోట్లు. నివాస భవనమైతే 0.15 శాతం ప్రకారం రూ.18 వేలు పన్ను నిర్ధారిస్తారు. నివాసేతర ఆస్తులకు మూలధన విలువలో 0.75 శాతాన్ని పన్నుగా నిర్ధారిస్తారు. ఆస్తి పన్ను స్వీయ మధింపునకూ నూతన చట్టంలో అవకాశం ఉంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలో వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
ఏఐ.. రెండో టీచర్!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!
Read Latest AP News And Telugu News