Share News

పెరిగిన సేవలు.. సరిపోని సిబ్బంది

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:36 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆదాయం వృద్ధి చెందింది. స్వామివారి దర్శనం, ప్రసాదాలు, అన్నదానం, భద్రత, ప్రొటోకాల్‌, పారిశుధ్యం, కల్యాణ కట్ట, పుష్కరిణి, తాగునీటి సరఫరా వంటి సేవలు విస్తరించాయి. ఇదంతా బాగానే ఉందిగానీ..

పెరిగిన సేవలు.. సరిపోని సిబ్బంది
Yadagirigutta

  • పునర్నిర్మాణం తర్వాత యాదగిరికి తండోపతండాలుగా భక్తులు.. గణనీయంగా పెరిగిన వార్షికాదాయం

  • పాతస్ట్రెంత్‌ ప్రకారమే రెగ్యులర్‌ ఉద్యోగులు

  • అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో సేవలు

  • వారిపై పర్యవేక్షణ కరువు..

  • 20 విభాగాలకు ఐదుగురే ఏఈవోలు

  • అదనపు బాధ్యతలతో సతమతం

  • ఉద్యోగులను పెంచాలంటూ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు పెండింగులో..

యాదాద్రి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆదాయం వృద్ధి చెందింది. స్వామివారి దర్శనం, ప్రసాదాలు, అన్నదానం, భద్రత, ప్రొటోకాల్‌, పారిశుధ్యం, కల్యాణ కట్ట, పుష్కరిణి, తాగునీటి సరఫరా వంటి సేవలు విస్తరించాయి. ఇదంతా బాగానే ఉందిగానీ.. పెరిగిన భక్తుల తాకిడికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. పైగా ఏటా ఉద్యోగ విరమణలతో ఖాళీలు పెరుగుతున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోం ది. దీంతో కిందిస్థాయి సేవలకు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని వినియోగిస్తున్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై పర్యవేక్షణకు సైతం అధికారులు లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.


20 విభాగాలు కీలకం

యాదగిరిగుట్ట ఆలయ పాలనా వ్యవహారాల్లో 20విభాగాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ఐఏఎస్‌ హోదా ఉన్న కార్యనిర్వహణాధికారి, ఆలయ సర్వీసుకు చెందిన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, ఐదుగురు సహాయ కార్యనిర్వహణాధికారులు, 14 మంది సూపరింటెండెంట్‌లు ఉన్నారు. అయితే ఆలయ పునర్నిర్మాణం, ఉద్ఘాటనలతో తెలంగాణ, ఏపీ నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దసంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ మేరకు ఆలయానికి ఆదాయం సైతం పెరిగింది. 2022లో వార్షికాదాయం రూ.79కోట్లు కాగా 2025-26 ఆర్థికసంవత్సరానికి రూ.240కోట్లకు పెరిగింది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పారిశుధ్యం నుంచి ఐటీ సేవల వరకు సేవలు పదిరెట్లు విస్తృతమయ్యాయి. కానీ, ఆలయంలో అప్పటి క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ఉన్న 283మంది రెగ్యులర్‌ ఉద్యోగులతోనే ఇప్పటికీ ఆలయ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. కింది స్థాయిలో మాత్రం 400 మందిని అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా నియమించారు.


ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంపునకు దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు అప్పట్లో అధికారులు పంపించారు. కానీ, పూర్తిస్థాయిలో అవసరాలను గుర్తించలేదనే కారణంతో ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. అప్పటి నుంచి దాదాపు నాలుగేళ్లుగా ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు కేటాయిస్తున్నారు. కార్యనిర్వహణాధికారి తరఫున పూర్తి పాలనా వ్యవహారాల బాధ్యతలు ఏఈవోలు నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతం 20 విభాగాలకు ఐదుగురే ఉండటంతో ఉన్నవారికే 3-5 విభాగాల బాధ్యతలు అప్పగించారు. దేవాలయంలో కీలకమైన సివిల్‌, ఎలక్ట్రికల్‌, నీటిసరఫరా, ఇంజనీరింగ్‌ విభాగాలకు సైతం ఒక ఏఈవో అవసరం. అధికారుల కొరతతో ఈ బాధ్యతలను పూర్తిగా ఇంజనీరింగ్‌ అధికారులకే అప్పగించారు. దీంతో ఆడిట్‌ అభ్యంతరాలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉంది. విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడానికి కనీసం మరో నలుగురు అవసరమని అధికారులు భావిస్తున్నారు. క్యాడర్‌స్ట్రెంత్‌లో సైతం 9మందికి ప్రతిపాదనలు పంపారు. సూపరింటెండెంట్‌ పోస్టులు 18కి, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 22కు పెంచాల్సిన అవసరం ఉందని ఆలయ అధికార వర్గాలు భావిస్తున్నాయి.


ఆలయ ప్రతిష్ఠకు భంగం

పర్యవేక్షణ అధికారుల కొరతను అలుసుగా తీసుకుని కొందరు అవుట్‌ సోర్సింగ్‌, కిందిస్థాయి ఉద్యోగులు బాధ్యతారహితంగా ప్రవర్తించటం, అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వైఖరి వల్ల దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతింటోందన్న విమర్శలున్నాయి. బంగారు నాణేల విక్రయాల్లో అవినీతి ఆరోపణలు వెలువడ్డాయి. ప్రసాదాల సెక్షన్‌లో చింతపండు, కాజు, నూనె డబ్బాల దుర్వినియోగంతో పాటు ప్రసాదాల నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపైకి వాహనాల ప్రవేశాలకు రూ.500 టికెట్ల జారీ, దేవస్థానం నిర్వహించే ఉచిత బస్సులు వంటి పనుల్లోనూ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే కానిస్తున్నారు. వీటి మీద సరిగా పర్యవేక్షణ లేకపోవటంతో ఆలయ నిధులకు గండితో పాటు భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆలయ పాలనా వ్యవహరాల సేవలకు, పర్యవేక్షణకు అవసరమైన రెగ్యులర్‌ సిబ్బందిని, క్యాడర్‌ స్ట్రెంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఆలయ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇవి కూడా చదవండి...
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక

ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడే..

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 05:36 AM