ప్రయాణికులకు అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాలు రద్దు
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:40 PM
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దు అయ్యాయి.
హైదరాబాద్, మార్చి 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్) నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా విమానాయన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అలాగే కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లే సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన సుమారు 22 విమానాలు రద్దు కాగా, వివిధ దేశాల నుంచి రావాల్సిన మరో 22 విమానాలు కూడా రద్దయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.
విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయం పరిసరాలు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక సూచన జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని... ఫ్లైట్ స్టేటస్‌ను ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు, ఎయిర్‌పోర్ట్ అధికారుల ద్వారా తెలుసుకోవాలని డీజీసీఏ సూచించింది.
ఇవి కూడా చదవండి...
పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
బైక్‌ను ఢీకొన్న స్కూల్ బస్సు... ఇద్దరి మృతి
Read Latest Telangana News And Telugu News