Share News

హైదరాబాద్‌కు పునాది వేసింది ఇరానీలే

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:46 AM

ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు ఇరాన్‌తో ఉన్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌కు పునాది వేసింది ఇరానీలే

  • ఇరాన్‌తో 400 ఏళ్లకుపైగా బంధం

  • ఇక్కడి నిర్మాణాలు, ఆహారం, ఆహార్యం, సంస్కృతుల్లో ఇరానీ ముద్ర

హైదరాబాద్‌ సిటీ, మార్చి1 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు ఇరాన్‌తో ఉన్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగర రూపశిల్పి మీర్‌ మోమిన్‌ అస్త్రాబాదీ ఇరాన్‌ (నాటి పర్షియా) నుంచి వచ్చినవారే. ఈ నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాంషాహీలు కూడా ఇరాన్‌ నుంచి వలస వచ్చినవారే . మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్‌ మోమిన్‌ అస్త్రాబాదీ.. 1591లో తన ప్రభువు కలలకు రూపమిస్తూ సుందర ఉద్యాన వనాలు, అద్భుత కట్టడాలతో నగరాన్ని నిర్మించాడు. గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్‌, కుతుబ్‌ షాహీల సమాధులు.. ఇలా నగర ఖ్యాతిని ఇనుమడింపచేసే ఎన్నో వారసత్వ కట్టడాల్లో పర్షియన్‌ వాస్తు శైలి ప్రస్ఫుటిస్తుంది. మొహర్రం ఇరాన్‌, హైదరాబాద్‌ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి ఒక వారధి. దర్వాజ, ఖర్చు, మెహఫిల్‌, దావత్‌ వంటి ఎన్నో పర్షియన్‌ పదాలు ఇక్కడి ఉర్దూ, తెలుగులో కలిసిపోయి భాషలను సుసంపన్నం చేశాయని చరిత్రకారులు చెబుతుంటారు. బిర్యానీ, ఇరానీ చాయ్‌, హలీం వంటి ఆహార పదార్థాలన్నీ అక్కడి నుంచి వచ్చినవే. ఇరానీ కేఫ్‌లు, బిర్యానీ హోటళ్లు సైతం 20వ శతాబ్దం తొలినాళ్లలో ఇరానీలు ఇక్కడకు వచ్చి నెలకొల్పినవే. నేటికీఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం సాగుతోంది. హైదరాబాద్‌ నుంచి ఔషధాలు వెళితే, అక్కడి నుంచి కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌ వస్తున్నాయి.

ఖమేనీ పేరుతో రోడ్డు

ఇరాన్‌ సంస్కృతి, స్నేహానికి గుర్తుగా నగరంలో కొన్ని ప్రాంతాలకు ఆ దేశం పేర్లు కూడా ఉన్నాయి. పాత నగరంలో ఇరానీ గల్లీ అందుకు ఉదాహరణ. నగరంలో ఇరాన్‌ కాన్సులేట్‌ కూడా ఉంది. ఇరాన్‌ మొదటి సుప్రీం నాయకుడు, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ వ్యవస్థాపకుడు ఇమామ్‌ ఖమేనీ స్మారకంగా ఇరాన్‌ దౌత్యకార్యాలయం ఉన్న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబరు-7కు ఖమేనీ పేరు పెట్టారు. వందకుపైగా ప్రఖ్యాత పర్షియన్‌ చారిత్రక పత్రాలు నగరంలోని ఆర్కైవ్స్‌లో ఉన్నాయి. 2018లో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ మనదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం, కుతుబ్‌ షాహీ సమాధులు, మక్కామసీదులను సందర్శించారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా ఆదివారం పాతనగరంలో ర్యాలీ తీశారు.

Updated Date - Mar 02 , 2026 | 02:46 AM