8 నెలల ఉపాధి ప్రణాళికను సిద్ధం చేయాలి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:27 AM
ఎల్నినోతో ఏర్పడే నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో 8 నెలలకు సరిపడా ఉపాధి పనులకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎల్నినోతో ఏర్పడే నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో 8 నెలలకు సరిపడా ఉపాధి పనులకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వీబీజీ రాం జీ పథకం కింద అనుమతించిన 370 రకాల పనులను ప్రాధాన్య క్రమంలో విభజించడంతోపాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా దశల వారీగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులపై ఆమె ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభించేలా ప్రణాళికలుండాలని ఆదేశించారు.
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే డీఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క.. పనుల పురోగతి కనిపించాలని, కేవలం సమాధానాలతో ఉపయోగం లేదని హెచ్చరించారు. జాబ్ కార్డుల జారీలో ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెలాఖరు నాటికి మండల స్థాయిలో పనుల ప్రణాళికలు పూర్తిచేసి, నవంబరు ఒకటో తేదీ నుంచి ఉపాధి పనుల ప్రారంభానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 2 నెలలకోసారి కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, చిన్న, సన్నకారు రైతుల అవసరాల మేరకు ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు. ఉపాధి పనుల ఎంపిక, అమలులో సర్పంచ్లను భాగస్వాములను చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News