Share News

నీళ్లు నింపుకోండి

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:45 AM

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ విషయంలో తెలంగాణకు ఉపశమనం లభించింది. ఎన్‌వోసీని త్వరగానే ఇస్తామని, అది వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదని, బ్యారేజీలో నీళ్లు నింపుకోవడం మొదలుపెట్టవచ్చని ఛత్తీ్‌స్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నీళ్లు నింపుకోండి
Revanth Reddy, Vishnu Deo Sai

  • ఎన్‌వోసీ త్వరగానే ఇస్తాం.. అప్పటిదాకా ఆగక్కర్లేదు

  • సమ్మక్కసాగర్‌పై ఛత్తీస్‌గఢ్‌ సీఎం సాయ్‌ సానుకూల స్పందన

  • ఎల్‌నినో కష్టాల్లో ఉన్నాం... వెంటనే ఎన్‌వోసీ ఇవ్వాలన్న రేవంత్‌

  • గరిష్ఠ వరద ముంపునకూ పరిహారమిస్తామని స్పష్టీకరణ

  • ముంపు అధ్యయనానికి రూ.9.88 కోట్లు చెల్లించామని వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క సాగర్‌ బ్యారేజీ విషయంలో తెలంగాణకు ఉపశమనం లభించింది. ఎన్‌వోసీని త్వరగానే ఇస్తామని, అది వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదని, బ్యారేజీలో నీళ్లు నింపుకోవడం మొదలుపెట్టవచ్చని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయ్‌పూర్‌లోని సాయ్‌ అధికారిక నివాసంలో మంగళవారం ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి తెలంగాణకు నీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని రేవంత్‌ ఈ భేటీలో వివరించారు. అందుకే నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) వెంటనే ఇవ్వాలని కోరారు.


దీనికి సాయ్‌ ఉదారంగా స్పందించారు. బీజాపూర్‌ జిల్లాలో ముంపు ప్రాంతాన్ని అంచనా వేసి, పరిహారం ఖరారు చేస్తూ ఎన్‌వోసీ జారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ పర్యాటక శాఖ మంత్రి రాజేశ్‌ అగర్వాల్‌, ఆ రాష్ట్ర సీఎస్‌ వికాస్‌ శీల్‌, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద 2017లో చేపట్టిన ఈ బ్యారేజీ నిర్మాణం 2021-22 నాటికే దాదాపు పూర్తయింది. అయినా ఛత్తీస్‌గఢ్‌ అనుమతి లేక ఐదేళ్లుగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. విష్ణుదేవ్‌ సాయ్‌ సానుకూల స్పందనను పెద్ద ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అనుమతి కోసం తెలంగాణ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)ను ఆశ్రయించింది.


జలాశయం వల్ల పొరుగు రాష్ట్రంలోని రెవెన్యూ, అటవీ భూములు మునుగుతాయి కాబట్టి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్‌వోసీ తేవాలని సీడబ్ల్యూసీ సూచించింది. గోదావరే ఇక్కడ ఇరు రాష్ట్రాల మధ్య సహజ సరిహద్దు. సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని మిగతా విభాగాలన్నింటి నుంచి అనుమతులు వచ్చాయని రేవంత్‌ వివరించారు. ఎన్‌వోసీ వస్తే అంతర్రాష్ట్ర విభాగం క్లియరెన్స్‌, ఆ తర్వాత సాంకేతిక సలహా మండలి(టీఏసీ) అనుమతి లభిస్తాయని తెలిపారు. ఈ అధికారిక అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ప్రజాప్రయోజనాల దృష్ట్యా మిగిలిన అనుమతుల ప్రక్రియనూ వేగవంతం చేయాలని రేవంత్‌ కోరారు. అవసరమైతే షరతులతో కూడిన ఎన్‌వోసీ అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ముంపుపై భిన్న అంచనాలు

ఈ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. అక్కడ నిర్మిస్తే 11,408 ఎకరాల భూమి, 17 ఆదివాసీ గ్రామాలు మునిగిపోతాయని, భద్రత, మౌలిక వసతుల పైనా ప్రభావం పడుతుందని తేలింది. దాంతో ముంపును తగ్గించేందుకు నిర్మాణ స్థలాన్ని తుపాకులగూడెంకు మార్చామని తెలంగాణ వివరించింది. ఛత్తీస్‌గఢ్‌ కోరిన మేరకు ముంపు అధ్యయనం కోసం రూ.9.883 కోట్లను ఏప్రిల్‌లోనే చెల్లించామని, ఐఐటీ ఖరగ్‌పూర్‌ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి సమర్పించిందని తెలిపింది. తెలంగాణ అధికారులు వెల్లడించిన నివేదిక వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయి. గరిష్ఠ వరద వచ్చినా ముంపు 100 ఎకరాల లోపేనని, నదీగర్భాన్ని మినహాయిస్తే మునిగే ప్రైవేటు భూమి సుమారు 32 ఎకరాలేనని వారు చెబుతున్నారు.


అయితే పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్ఆర్‌ఎల్‌) వద్ద బీజాపూర్‌ జిల్లాలోని తార్లగూడ సహా 2-3 గ్రామాల పరిధిలో సుమారు 300 హెక్టార్ల(దాదాపు 740 ఎకరాలు) రెవెన్యూ, అటవీ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్‌ జలవనరుల శాఖ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఐఐటీ నివేదిక ఆధారంగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రస్తుతం ఉమ్మడి సర్వే చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధానంలో నిర్వాసితులుగా గుర్తించిన ప్రతి భూయజమానికీ పరిహారం చెల్లిస్తామని రేవంత్‌ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.


పట్టువదలని ప్రయత్నాలు

ఎన్‌వోసీ కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు సాయితో చర్చించారు. 2025 సెప్టెంబరు 22న నయా రాయ్‌పూర్‌లో, 2026 జూన్‌ 11న హైదరాబాద్‌లో, సెప్టెంబరు 4న న్యూఢిల్లీలో ఆయనను కలిశారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ 2025 జనవరి 18, మార్చి 3, జూలై 14, సెప్టెంబరు 14, డిసెంబరు 13 తేదీల్లో, 2026 జూన్‌ 11న ఎన్‌వోసీ కోసం లేఖలు రాశారు. చివరకు సీఎం స్వయంగా రంగంలోకి దిగి, గరిష్ఠ వరద ముంపునకూ పరిహారం ఇస్తామని ప్రకటించారు. దాంతో ఛత్తీస్‌గఢ్‌ సానుకూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు.


4.40 లక్షల ఎకరాల స్థిరీకరణ

సమ్మక్కసాగర్‌ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు(ఎఫ్ఆర్‌ఎల్‌ 83 మీటర్లు). శ్రీరాంసాగర్‌ రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాలు, రామప్ప--పాకాల అనుసంధానం కింద 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం దీని లక్ష్యం. భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా 32,563 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలోని గ్రామాల తాగునీటి అవసరాలనూ తీర్చనుంది. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, జనగామ, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్‌ ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు సాగు, తాగునీటి భద్రత కల్పించనుంది.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:54 AM