పల్లె ఉదరం అదరహో..!
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:45 AM
పల్లెల నుంచి పట్టణాలకు కొనసాగుతున్న వలసలు ప్రజల జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లనూ మార్చేస్తున్నాయి.
గ్రామీణుల పొట్టలో మంచి బ్యాక్టీరియా ఎక్కువ
పట్టణ ప్రజల పేగుల్లోని బ్యాక్టీరియాలో మార్పులు
మంచి బ్యాక్టీరియా తగ్గుదల.. మెగామోనాస్ వృద్ధి
ఊబకాయం, రక్తంలో చక్కెర పెరుగుదల సమస్యలు
భారత్, శ్రీలంకలోని 10 తెగలపై అధ్యయం
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పల్లెల నుంచి పట్టణాలకు కొనసాగుతున్న వలసలు ప్రజల జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లనూ మార్చేస్తున్నాయి. ఒకప్పుడు చిరుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు, పప్పుధాన్యాలు, స్థానికంగా లభించే సహజ ఆహారంతో సాగిన జీవితం.. ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన పదార్థాలు, శుద్ధి చేసిన ధాన్యాలు, అధిక కొవ్వు, చక్కెరతో కూడిన ఆహారం వైపు మళ్లుతోంది. ఈ మార్పు మన జీర్ణవ్యవస్థలో నివసించే సూక్ష్మజీవుల ప్రపంచంపై ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికా, భారత్, శ్రీలంక పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం ‘గట్ మైక్రోబీస్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది.
‘డిస్టింక్ట్ ట్రాజెక్టరీస్ ఆఫ్ అర్బనైజేషన్ షేప్ ద హ్యూమన్ గట్ మైక్రోబయోమ్ అక్రాస్ సౌత్ ఏషియా’ పేరుతో వెలువడిన ఈ పరిశోధన దక్షిణాసియా ప్రజల పేగుల్లోని బ్యాక్టీరియా, ఆహారపు అలవాట్లు, పట్టణీకరణ మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించింది. భారత్, శ్రీలంక కు చెందిన 10 భిన్న భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యాలున్న సముదాయాలకు చెందిన 575 మంది ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించారు. వీరిలో 261 మంది గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ జీవనశైలి కొనసాగిస్తున్నవారు కాగా.. 314 మంది ఏడాదికి పైగా పట్టణాల్లో నివసిస్తున్నవారు. భారత్‌లోని గోండు, కొలామ్, కోయ, కాని, మిజో, పోచురీ నాగాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి ప్రాంత ప్రజలతో పాటు శ్రీలంకలోని ఆదివాసీ సముదాయాలు, సింహళ, తమిళ ప్రజలను పరిశోధనలో భాగం చేశారు. వీరి నుంచి సేకరించిన మల నమూనాలతో పేగుల్లోని బ్యాక్టీరియా రకాలను గుర్తించారు.
పల్లెవాసుల్లో 3 రకాల మంచి బ్యాక్టీరియా
గ్రామీణ జీవనశైలి ఉన్నవారిలో ప్రివోటెల్లేసీ, సక్సినివిబ్రియో, హోల్డెమానెల్లా అనే బ్యాక్టీరియా లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ప్రివోటెల్లేసీ, సక్సినివిబ్రియోలకు సంప్రదాయ గ్రామీణ ఆహారపు అలవాట్లతో సంబంధం ఉంది. హోల్డెమానెల్లా పీచు పదార్థాల వినియోగం, మెరుగైన గ్లూకోజ్ సహనశక్తి, తక్కువ వాపు వంటి ఆరోగ్య లక్షణాలతో సంబంధం కలిగి ఉన్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరిగేకొద్దీ గ్రామీణ జీవనశైలితో సంబంధం ఉన్న కొన్ని బ్యాక్టీరియాలు నశిస్తున్నాయని గుర్తించారు. ముఖ్యంగా హోల్డెమానెల్లా తగ్గుతోంది. పట్టణ జీవనశైలితో సంబంధం ఉన్న మెగామోనాస్ను ప్రత్యేకంగా గుర్తించారు. గత పరిశోధనల్లో దీనికి ఊబకాయంతో సంబంధమున్నట్లు తేలింది.
కొవ్వుల శోషణను పెంచే ప్రక్రియతోపాటు మధుమేహాన్ని సూచించే హెచ్‌బీఏ1సీ స్థాయులతోనూ సంబంధమున్నట్లు గత అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజా పరిశోధనలోనూ మెగామోనాస్ అధికంగా ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ పెరిగినట్లు గుర్తించారు. బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ)పెరుగుదలతోనూ దీనికి సంబం ధమున్నట్లు అనుమానిస్తున్నారు. పట్టణాల్లోని వారిలో బాక్టీరాయిడ్స్, పారాబాక్టీరాయిడ్స్, అలిస్టిప్స్ వంటి సమూహాలు ఎక్కువగా కనిపించాయి. మరోవైపు మొక్కల ఆధారిత ఆహారం, సంప్రదాయ జీవనశైలితో సంబంధం ఉన్న బ్యాక్టీరియా సమూహాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించాయి. ఈ సమూహాల మధ్య ప్రతికూల సంబంధాన్నీ పరిశోధకులు గుర్తించారు. అంటే పట్టణీకరణతో సంబంధం ఉన్న కొన్ని బ్యాక్టీరియా సమూహాలు పెరిగినప్పుడు.. పేగుల్లోని వైవిధ్యాన్ని కాపాడే మరో సమూహం తగ్గటం కనిపించింది.
మరో ఆసక్తికర విషయం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలవారి మధ్య బ్యాక్టీరి యా వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ఆహార పదార్థా లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ప్రాంతం, సముదాయం, సంప్రదాయ ఆహారపు అలవాట్లు కూడా బ్యాక్టీరియా మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో గోండు, కొలామ్, కోయ వంటి మధ్య భారత్‌కు చెందిన ఆదివాసీ సముదాయాలను చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదిలాబాద్, భద్రాద్రి ప్రాంతాలతో అనుబంధమున్న ఆదివాసీ సంప్రదాయ జీవనశైలి, ఆహారపు అలవాట్ల నేపథ్యంలోనూ పరిశోధనకు ప్రాముఖ్యం ఏర్పడింది. పట్టణీకరణతో పేగుల్లోని బ్యాక్టీరియాలో మార్పులు వస్తుండటంతో ఊబకాయం చక్కెర, రక్తపోటు పెరుగుతున్నట్లు ఈ పరిశోధన వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News