Share News

తమాషా చేస్తే.. టైర్ల కిందేసి తొక్కిస్తా!

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:24 AM

‘తమాషా చేస్తే బస్సు టైర్ల కింద వేసి తొక్కిస్తా...’’ అంటూ అసభ్యపదజాలంతో పదో తరగతి విద్యార్థితో అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు.

తమాషా చేస్తే.. టైర్ల కిందేసి తొక్కిస్తా!
Mahabubabad RTC

  • టెన్త్‌ విద్యార్థిపై ఆర్టీసీ డ్రైవర్‌ దురుసు ప్రవర్తన

  • మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

  • డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించిన అధికారులు

హైదరాబాద్‌, తొర్రూరు రూరల్‌/నెల్లికుదురు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘తమాషా చేస్తే బస్సు టైర్ల కింద వేసి తొక్కిస్తా...’’ అంటూ అసభ్యపదజాలంతో పదో తరగతి విద్యార్థితో అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన ఓ బాలుడు నెల్లికుదురు మోడల్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ బాలుడు ఫుట్‌బోర్డు వద్దే నిలబడ్డాడు.


ఈ విషయాన్ని గమనించిన ఆ బస్సు డ్రైవర్‌ స్వామి.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత బస్సును ఆపి ఆ బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందో ఏమో కానీ... డ్రైవర్‌ స్వామి బాలుడిని అసభ్యపదజాలంతో దూషిస్తూ తమాషాలు చేస్తే టైర్లు కింద వేసి తొక్కిస్తా అని హెచ్చరించాడు. ఆపై, బాలుడి మెడ మీద చెయ్యి వేసి లోపలికి ఎక్కంటూ బలవంతంగా బస్సులోకి నెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో శనివారం వైరలైంది. దీంతో స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన స్వామిని విధుల నుంచి తొలగించింది. ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తున్న స్వామి.. గతంలోనూ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళను కొట్టి, జుట్టు పట్టి ఈడ్చి..
‘బరువు’ దోపిడీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:24 AM