Share News

మహిళను కొట్టి, జుట్టు పట్టి ఈడ్చి..

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:15 AM

ఒంటి మీద ఖాకీ దుస్తులున్నాయని అహమో... మహిళని చిన్నచూపో తెలియదు కానీ.. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఓ హోంగార్డు ఓ మహిళపై రెచ్చిపోయాడు. మహిళపై చెయ్యి చేసుకోవడమే కాక.. ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు.

మహిళను కొట్టి, జుట్టు పట్టి ఈడ్చి..
Hafeezpet railway station incident

  • హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌లో హోంగార్డు దాష్టీకం

  • బాధితురాలి కుటుంబ సభ్యులు

  • ఎంత వేడుకున్నా వదలని వైనం

  • అతడి అరెస్టు, విధుల నుంచి తొలగింపు

మియాపూర్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఒంటి మీద ఖాకీ దుస్తులున్నాయని అహమో... మహిళని చిన్నచూపో తెలియదు కానీ.. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఓ హోంగార్డు ఓ మహిళపై రెచ్చిపోయాడు. మహిళపై చెయ్యి చేసుకోవడమే కాక.. ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. పోలీసు విభాగానికి చెందిన హోంగార్డు ఆనంద్‌.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై హఫీజ్‌పేట్‌ రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఉండే ఓ మహిళ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆమెకు, హోంగార్డు ఆనంద్‌కు మధ్య గొడవ జరిగింది.


మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన ఆనంద్‌ మహిళను లాఠీతో, చేతితో కొట్డాడు. ఆపై, ఆమె జుట్టు పట్టుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. మహిళ కుటుంబసభ్యులు, అక్కడే ఉన్నవారు ఎంత చెప్పినా ఆనంద్‌ శాంతించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్‌ పోలీసులు ఆనంద్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసు శాఖపై తీవ్ర విమర్శలకు దారితీసిన ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్‌ కూడా స్పందించారు. ఆనంద్‌ను విధుల నుంచి తొలగించాలని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ రమేష్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆనంద్‌ను విధుల నుంచి తొలగించారు. కాగా, ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కూడా స్పందించారు. మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ప్రజలు, రాజకీయ ప్రత్యర్థుల విషయంలో యూనిఫాంలో ఉన్న వీధి గూండాలకు ఏమాత్రం పోలీసులు తీసిపోరని విమర్శించారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నా రాజకీయ క్రీడలు ఆడడంలోపోలీసులు తీరిక లేకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

152 మీటర్లతో ముంపు ఉండదు
‘బరువు’ దోపిడీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:15 AM