152 మీటర్లతో ముంపు ఉండదు
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:06 AM
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని తెలంగాణ పేర్కొంది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీతో మహారాష్ట్రలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు
మహారాష్ట్ర, సీడబ్ల్యూసీకి తెలిపిన తెలంగాణ ఈ నెల 1న జరిగిన సమావేశం
వివరాలను పంపించిన రాష్ట్ర ప్రభుత్వం
హైడ్రాలజీపై మరింత కసరత్తు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని తెలంగాణ పేర్కొంది. 152 మీటర్ల ఎత్తునకు అనుమతించాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)ను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఈ నెల 1న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 150 మీటర్లు, 151 మీటర్లు, 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే ముంపు లేదని నిర్ధారించే కాంటూరు మ్యాపులతోపాటు అధ్యయన నివేదికలను సీడబ్ల్యూసీకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ముంపునకు సంబంధించి ఈ అధ్యయనాన్ని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిర్వహించింది. ఇక హైడ్రాలజీ డేటాలో మరికొన్ని మార్పులు చేసి, ఆ వివరాలను కూడా సీడబ్ల్యూసీకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. కాగా, వెన్‌గంగ, వార్ధా నది సంగమ ప్రాంతంలో రెండు బ్యారేజీలు కూడా ఒకే కాంప్లెక్స్‌గా ఉండనున్నాయి.
నది ప్రవాహానికి అడ్డంగా లంబాకారంలో బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నారు. వెన్‌గంగపై 1113.50 మీటర్ల పొడవుతోచ వార్ధాపై 867 మీటర్ల పొడవుతో బ్యారేజీ కట్టనున్నారు. ఇక తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో పట్టుబట్టి... చివరికి 150 మీటర్ల ఎత్తుకైనా మహారాష్ట్రను ఒప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి అనుమతినిప్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జూన్ 11న సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖ నేపథ్యంలో ఈ నెల 1నన్యూఢిల్లీలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శులతో సీడబ్ల్యూసీ కీలక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాయాలను సీడబ్యూసీకి పంపిపంది.
1975లో మూడు సంయుక్త ప్రాజెక్టులు
1975 అక్టోబరు 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య లెండి ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగా, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని తెలంగాణ గుర్తు చేసింది. 1978 ఆగస్టు 7న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం (మహారాష్ట, ఆంధ్రప్రదేశ్) ప్రకారం.. ప్రాణహితపై అనువైన స్థలంలో బ్యారేజీ నిర్మించాలనే నిర్ణయం జరిగిందని పేర్కొంది. 2010లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం అవసరమైన డీపీఆర్ కోసం సీడబ్ల్యూసీ కూడా అనుమతినిచ్చిందని తెలిపింది. వాస్తవానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి 2016 మార్చి 8న మహారాష్ట్రతో ఒప్పందం కూడా జరిగిన విషయం విదితమే. దీనిని అప్పట్లో 165 టీఎంసీలతో చేపట్టగా, 2015 ఫిబ్రవరి 13న హైడ్రాలజీ అనుమతి కూడా లభించింది. ఇరిగేషన్ ప్లానింగ్, అంతరాష్ట్ర క్లియరెన్స్, సెంట్రల్ సాయింట్ మెటీరియల్ రిసేర్చ్ స్టేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, కన్‌స్ట్రక్షన్ మిషనరీ కన్సలెన్సీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనుమతులూ వచ్చాయి. ఇక పర్యావరణ అనుమతి కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ జరగగా.. మహారాష్ట్రలో మాత్రం ఈ పని పూర్తికాలేదు.
హైడ్రాలజీ డేటాకు తుదిరూపు
నీటి లభ్యత అధ్యయనాల నివేదికకు అధికారులు తుదిరూపునిచ్చే పనిలో పడ్డారు. సీడబ్ల్యూసీ అధ్యయనాల ప్రకారమే తుమ్మిడిహెట్టి వద్ద 235 టీఎంసీల దాకా నీటి లభ్యత ఉందని తేలడంతో.. మరిన్ని వివరాలు జోడించి ఈ నివేదికను త్వరలోనే మహారాష్ట్ర, సీడబ్ల్యూసీకి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్ఆర్)ను సీడబ్ల్యూసీకి అందించి, అనుమతి సాధించిన అనంతరం డీపీఆర్‌ను దాఖలు చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక తదుపరి సమావేశం(తెలంగాణ, మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ మధ్య) ఈ నెలాఖరులో జరిగే అవకాశాలున్నాయి. ఈలోగా వివరాలన్నీ నవీకరించే పనిలో అధికారులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జన్వాడ ఫాంహౌస్.. అక్రమ నిర్మాణం
‘బరువు’ దోపిడీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News