Share News

విత్‌ బ్రోకర్‌ ఓన్లీ.. ఆర్‌టీఏ కార్యాలయాల్లో నయా విధానం

ABN , Publish Date - Sep 22 , 2026 | 09:59 AM

‘ఆఫీసుల్లోకి ఏజెంట్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవు. నో ఎంట్రీ ఫర్‌ బ్రోకర్స్‌ విధానం కచ్చితంగా అమలు చేయాలి’ అని ఏసీబీ దాడులు జరిగినప్పుడు, ఉద్యోగులు అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారీ రవాణా శాఖ ఉన్నతాధికారులు జారీ చేసే ప్రకటన ఇది.

విత్‌ బ్రోకర్‌ ఓన్లీ.. ఆర్‌టీఏ కార్యాలయాల్లో నయా విధానం
RTA broker system

  • ఏజెంట్‌తో వెళితే సులువుగా పనులు

  • నో బ్రోకర్‌ పాలసీ అమలుకు కేంద్ర కార్యాలయం ఆదేశాలు

  • క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు

  • బండ్లగూడ ఆర్‌టీఏ ఆఫీస్‌ వ్యవహారంతో మళ్లీ చర్చ

హైదరాబాద్‌ సిటీ: ‘ఆఫీసుల్లోకి ఏజెంట్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవు. నో ఎంట్రీ ఫర్‌ బ్రోకర్స్‌ విధానం కచ్చితంగా అమలు చేయాలి’ అని ఏసీబీ దాడులు జరిగినప్పుడు, ఉద్యోగులు అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారీ రవాణా శాఖ ఉన్నతాధికారులు జారీ చేసే ప్రకటన ఇది. అనంతరం షరా మామూలే. ఫైల్‌కు ఇంత అని వసూలు చేసే విధానం ఆర్‌టీఏ ఆఫీసుల్లో ఆగడం లేదు. ఏళ్లుగా అలవాటైన విధానం, అదనంగా డబ్బులు వచ్చే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటామని కొందరు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం.


నో బ్రోకర్‌ పాలసీ అమలు చేయాలని కేంద్ర కార్యాలయం సూచిస్తే.. మధ్యవర్తులు లేకుండా వస్తే పని చేసేది లేదన్నట్టు క్షేత్రస్థాయిలో అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. బండ్లగూడ ఆఫీ్‌సలో నగదు లెక్కింపు వ్యవహారంతో ఆర్‌టీఏ కార్యాలయాల్లో అవినీతి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో కాదు.. రవాణా శాఖ కమిషనర్‌ ఉండే ఖైరతాబాద్‌లోని కార్యాలయంలోకి ఏజెంట్లు యథేచ్ఛగా ప్రవేశిస్తారు. ఆ ఆఫీ్‌సకు సమీపంలోనే దళారుల కార్యాలయాలూ ఉంటాయి. ఆన్‌లైన్‌ సేవల పేరిట వారు చేసే దందా అంతా ఇంతా కాదు.


స్లాట్‌ బుకింగ్‌ చేసే సమయంలోనే.. మీరు లెర్నర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ల్లో పాల్గొంటారా..? అవేం లేకుండానే లైసెన్స్‌ కావాలా? అని ఆఫర్‌ ఇస్తారు. టెస్ట్‌ లేకుండా.. డీఎల్‌ కావాలంటే.. కేవలం స్లాట్‌ మాత్రమే బుక్‌ చేయాలంటే మరో రేటు చెబుతారు. టూ వీలర్‌ లైసెన్స్‌ అయితే రూ.3000 నుంచి రూ.3500, టూ, ఫోర్‌ వీలర్‌ లైసెన్స్‌ కావాలంటే రూ.6500 నుంచి రూ.7000 తీసుకుంటారు. ఇది బహిరంగంగా జరుగుతున్న దందా. ఇక డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకులది మరో దందా. డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు వచ్చినప్పుడే.. నిర్వాహకులు లైసెన్స్‌తో పాటా? ఓన్లీ డ్రైవింగ్‌ నేర్పితే చాలా? అని వినియోగదారులను అడుగుతారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు శిక్షణ ఇస్తే రూ.10 వేల నుంచి రూ.15 వేలు, ఓన్లీ డ్రైవింగ్‌ అయితే రూ.4 వేల నుంచి రూ.8 వేలు తీసుకుంటున్నారు.


నేరుగా వెళితే చుక్కలే..

పౌరులు నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని వెళితే.. లర్నర్‌ లైసెన్స్‌ పొందడమూ కష్టమే. కంప్యూటర్‌లో జరిగే టెస్ట్‌లో పాల్గొనే క్రమంలో కొందరు ఆందోళనకు గురవుతారు. మరో అవకాశం ఇవ్వకుండా వారు టెస్ట్‌లో ఫెయిల్‌ అయినట్టు మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) నిర్ధారిస్తారు. దీంతో నిర్ణీత రుసుము చెల్లించి మరోసారి టెస్ట్‌లో పాల్గొనాల్సిందే. అదే ఏజెంట్ల ద్వారా వెళితే.. చాలా మందికి ఎలాంటి టెస్ట్‌ నిర్వహించరు. కొందరు దరఖాస్తుదారులను మాత్రం టెస్ట్‌లో పాల్గొనాలని సూచిస్తారు. వారు కంప్యూటర్‌ ముందు కూర్చుంటే ఎంవీఐ ఎదుటే అక్కడ ఉండే కానిస్టేబుళ్లు సాయం చేస్తారు. కొన్ని డ్రైవింగ్‌ ట్రాక్‌ల వద్దా ఇదే పరిస్థితి. కొండాపూర్‌, టోలిచౌకి, ఉప్పల్‌ ఆర్‌టీఏ కార్యాలయాల్లో లర్నర్‌ లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌ టెస్ట్‌ను అక్కడి సిబ్బంది పూర్తి చేస్తుండడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి:

శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్‌ గణపయ్య నిమజ్జనం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 10:04 AM