ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ షురూ
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:43 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో మొదలైంది.
వికారాబాద్ జిల్లాలో 1,016 ఎకరాల సేకరణకు రంగం సిద్ధం
నాలుగు మండలాలు, 21 గ్రామాల్లో భూములు
భూసేకరణ అధికారిగా ఆర్డీవో, పీవోగా అదనపు కలెక్టర్
వికారాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో మొదలైంది. రహదారి నిర్మాణం కోసం వికారాబాద్ జిల్లాలో నాలుగు మండలాల్లోని 21 గ్రామాల పరిధిలో 1,016 ఎకరాల 26.95 గుంటల భూమిని సేకరించేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు భూసేకరణ అధికారిని, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తాజాగా రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ ఆర్డీవోకు భూసేకరణ అధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కు ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.
కాగా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించి జిల్లా స్థాయిలో భూసేకరణకు అధికారిక ఉత్తర్వులు వెలువడటం ఇదే తొలిసారి. దక్షిణ భాగం భూసేకరణకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రిక్విజిషనింగ్ అథారిటీగా వ్యవహరిస్తోంది. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (క్యూర్), ఎస్టేట్ ఆఫీసర్ ఈ నెల 13న నిర్దేశిత పత్రాల రూపంలో భూసేకరణ ప్రతిపాదనలు కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో రోజుల్లోనే కలెక్టర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టం (ఆర్ఎస్టీఎల్ఏఆర్ఆర్), దానికి 2016లో తెలంగాణ చేసిన సవరణ (2017 చట్టం నం.21) ప్రకారం
సెక్షన్లు 23, 30ఏ కింద ప్రక్రియ ప్రారంభించాలని హెచ్ఎండీఏ కోరింది. అంటే ఈ భూసేకరణ జాతీయ రహదారుల చట్టం కింద కాకుండా రాష్ట్ర భూసేకరణ చట్టం కింద సేకరణ జరగనుంది. ఈ భూసేకరణకు చట్టంలోని 2, 3 అధ్యాయాల నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మినహాయింపుతో గ్రామాల్లో సామాజిక ప్రభావ అధ్యయనం, నిపుణుల కమిటీ మదింపు వంటి దశలు లేకుండానే భూసేకరణ నేరుగా ముందుకు సాగనుంది. ఇటీవల హైదరాబాద్‌లో నదీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూసేకరణలో ఇదే సెక్షన్ వినియోగంపై కొందరు భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా, వారిని భూముల నుంచి తొలగించవద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News