పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానం
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:03 AM
పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని, అప్పుడే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుపై ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
నేను రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదగడం.. ప్రజాస్వామ్యం గొప్పదనం
‘సంసద్ రత్న’ అవార్డుల ప్రదానంలో కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని, అప్పుడే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుపై ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి.. ప్రశ్నించాలి.. సమస్యలను లేవనెత్తాలి. అంతేకానీ చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదు. ఒకప్పటి రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. కానీ ఈ తరం రాజకీయాలు, రాజకీయ విలువలు దిగజారుతున్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లవుతుంద’’ని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం జరిగిన ‘సంసద్ రత్న’ అవార్డుల కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందన్నారు. ‘‘చొక్కాలు విప్పామని ఒక పార్టీ, విప్పించామని మరోపార్టీ సంబరపడుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుంది. శాసన, పార్లమెంటు సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఒక రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా ప్రజాస్వామ్యం గొప్పతనం వల్లే సాధ్యమైంద’’ని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి పార్టీ కూడా అంతర్జాతీయ వేదికలపై జాతీయ అంశాలపై మాట్లాడేటప్పుడు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా వ్యవహరించాలన్నారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం సరికాదన్నారు. అనవసరమైన విమర్శలు చేసి.. ప్రజల్లో ఈ వ్యవస్థలపై నమ్మకం పోగొట్టొద్దని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో 16 మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు ‘సంసద్ రత్న’ అవార్డులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు
1100 ఎకరాల భూసేకరణ.. బుల్లెట్ రైల్ పనుల వేగవంతం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News