Share News

విద్యుత్ కోతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:48 PM

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతుండడంతో అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడే అధికారులను సహించేది లేదని స్పష్టం చేశారు.

విద్యుత్ కోతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, అక్టోబర్ 14: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతుండడంతో అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడే అధికారులను సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిని సస్పెండ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్పెషల్ సీఎస్, జెన్ కో సీఎండీల‌ను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనకు వెంటనే విద్యుత్ సరఫరాలో అంతరాయానికి గల కారణాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.


బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, కరెంట్ కోతలపై ఆ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని తాను ఎన్నిసార్లు ఆదేశించినా.. పరిస్థితిలో ఎందుకు మార్పు రాలేదని అధికారులను ఆయన నిలదీశారు. రానున్న రోజుల్లో విద్యుత్ కొరత ప్రమాదం పొంచి ఉన్నా ఎందుకు ఉత్పత్తి పెంచడం లేదని ప్రశ్నించారు. బొగ్గు కొరత లేకుండా నైనీ, మహానది గనుల నుంచి బొగ్గు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి ప్లాంట్‌లో సామర్ధ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను అడిగారు.


నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది తాను.. పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారంటూ విద్యుతు విభాగం అధికారుల తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్‌కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 10:02 PM