Share News

సర్‌కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:02 PM

సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ దసరా తర్వాత హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో మార్చ్‌తో పాటు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

సర్‌కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్
Tpcc Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, అక్టోబర్14: సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ దసరా తర్వాత హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో మార్చ్‌తో పాటు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దక్షిణాదిలో అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో సభలు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బుధవారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో విలేకర్లతో టీపీసీసీ చీఫ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మహిళా జర్నలిస్టులను అవమానించారంటూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.


ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాహుల్ గాంధీ షూ లేస్ కట్టారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ మొలకెత్తడానికి మాజీ ప్రధాని వాజ్‌పేయ్, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కారణమని గుర్తు చేశారు. వాళ్లు లేకుంటే బీజేపీ మొలకెత్తేదా? అని వ్యంగ్యంగా అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తామంటే ఎట్లా? అంటూ కేంద్రంలో మోదీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడిన వారికి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. సీజేపీ, ఇండియా కూటమి ఎవరికి వారే పోరాటం చేస్తున్నాయని వివరించారు.


ప్రజాస్వామ్యంలో భాషపై గౌరవం ఉండాలని టీపీసీసీ చీఫ్ చెప్పారు. గత 15 ఏళ్ల నుంచి ఆర్టీసీ ఎన్నికలు లేవని.. అందుకే వాటిని నిర్వహించామని తెలిపారు. ఓడినా గెలిచినా ఆ సంస్థ కార్మికుల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో విజయం కోసం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 23వ తేదీన సీఎం రేవంత్‌ రెడ్డితో పట్టబద్రుల ఎన్నికల సమావేశం ఉంటుందని అన్నారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరవుతారని అన్నారు.


ఎర్రవల్లిలో 45 ఎకరాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ జరుగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ చీఫ్ కవిత.. తన ఫ్యామిలీ గురించి ఎక్కువ వాస్తవాలు చెబుతుందని గుర్తు చేశారు. కవిత మాట్లాడే వాస్తవాలు అన్ని ప్రజలకు అర్థమవుతున్నాయని చెప్పారు. ఫాంహౌస్‌ల మీద దాడి చేయాలన్నది తమ అభిమతం కాదని అన్నారు. నీతిమంతులమని చెప్పుకుంటున్న వాళ్ల గురించి ప్రజలకు అసలు విషయాలు తెలియాలని ఫాంహౌస్ విజిట్ అని వివరించారు.


అయోధ్య మందిరానికి భూమి పూజ చేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. రాముడికి రాజకీయాలకు ఏమిటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ చేసిన తప్పిదాలు ఆధారాలతో సహా బయట పడుతున్నాయని వివరించారు. 2029లో ఎవరు ఓడిపోతారో ప్రజలు చెబుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం ప్రమాదంలో ఉందని తెలిపారు. బీజేపీ పాలనలో సామాన్యులకు ఏమి జరగలేదని చెప్పారు. సంపన్నులకు మాత్రమే లక్షల కోట్ల రూపాయిల రుణాలు మాఫీ చేశారని వివరించారు.


బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న సింగరేణి గర్జనకు అర్థం లేదని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు సంస్థ ఫలాలు తాము ఇస్తున్నామని తెలిపారు. ఎల్ నినో అనేది ప్రకృతి ప్రభావమని వివరించారు. 10 ఏళ్లు కేసీఆర్ ప్రతి దాన్ని రాజకీయం చేశారని చెప్పారు. కేసీఆర్ సెంటిమెంటును రెచ్చగొట్టి టైం పాస్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డవారికి న్యాయం జరగాలనే కార్పొరేషన్ పదవులు ఆలస్యం అవుతున్నాయని వివరించారు. దసరా నాటికి వాటిని భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతల ఖాతాలోకి భారీగా నగదు.. పోలీసుల దర్యాప్తు

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 07:07 PM