Share News

జమీందార్లుగా మారిన కొంత మంది ఎమ్మెల్యేలు: సీఎం రేవంత్

ABN , Publish Date - May 29 , 2026 | 09:42 PM

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

జమీందార్లుగా మారిన కొంత మంది ఎమ్మెల్యేలు: సీఎం రేవంత్

హైదరాబాద్, మే29: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లుగా త‌యార‌య్యారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్లుగా పార్టీ కోసం ప‌నిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వ్యక్తిగ‌త ప్రచారం త‌ప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల‌పై ప్రచారం చేయ‌డం లేదని మండిపడ్డారు. సోష‌ల్ మీడియాపై ఎమ్మెల్యేల‌కు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు.


ఎస్ఐఆర్‌‌పై అందరూ అవ‌గ‌హ‌న పెంచుకోవ‌డం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ వల్ల సామాన్యులు, పేద‌ల‌కు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయ‌కులు గుర్తించ‌డం మంచి ప‌రిణామం అని పేర్కొన్నారు. ఎస్ఐఆర్.. లంబాడీలు ,ఆదివాసీలు, వ‌ల‌స కార్మికులకు పెద్ద స‌మ‌స్య కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా మంది వ‌ల‌స పోయారని తెలిపారు. మహిళ‌ల‌కు కూడా ఎస్ఐఆర్ వ‌ల్ల సమస్యలు ఎదురుకావచ్చునన్నారు. ఎస్ఐఆర్ వల్ల ద‌ళితులు, మైనార్టీలు, మ‌హిళ‌ల ఓట్లు పోయే అవ‌కాశం ఉందని ఆందోళన చెందారు.


ఎస్ఐఆర్ వ‌ల్ల త‌లెత్తే సమస్యలకు ప‌రిష్కారంపైన‌ సంపూర్ణ అవ‌గాహ‌న పెంచుకోవాలని పార్టీ కేడర్‌కు ఈ సందర్భంగా సీఎం సూచించారు. బూత్ ఎన్‌రోల‌ర్ల సహాయంతో గ‌తంలో 90 రోజుల్లో 45 లక్షల డిజిట‌ల్ మెంబ‌ర్‌షిప్ చేయించామని వివరించారు. ఎక్కువ సభ్యత్వం న‌మోదు చేయించిన వారికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ‌తో స‌న్మానం చేయించామన్నారు. గ‌తంలో కాంగ్రెస్ సభ్యత్వంలో కీల‌క పాత్ర పోషించిన ఎన్ రోల‌ర్స్‌ను ఎస్ఐఆర్ విష‌యంలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉందన్నారు.


డిజిట‌ల్ మెంబ‌ర్‌షిప్ కోసం ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఇన్చార్జిను నియ‌మించి నిరంత‌రం పర్యవేక్షించామని చెప్పారు. ఎస్ఐఆర్ కోసం 119 నియోజ‌క‌వ‌ర్గాలు, 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్చార్జిలను నియ‌మించాల్సి ఉందని వివరించారు. అసెంబ్లీ ఇంచార్జిలు తప్పనిసరిగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండాల్సిందేనని చెప్పారు. ఇంచార్జిలు క‌రెక్ట్‌గా ప‌నిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా చూడొచ్చునని నేతలకు సీఎం రేవంత్ వివరించారు.


ఇన్చార్జి మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను ఇన్చార్జి మంత్రులు కల‌వాల్సి ఉందని వివరించారు. తాను కూడా 10 రోజుల‌కోసారి క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. నెలలో మూడు రోజులు పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇస్తానని పేర్కొన్నారు. పార్టీ కోసం ప‌నిచేయాల్సిందే నేతలకు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ ఛైర్మన్లు.. ప్రతి ఒక్కరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని.. చివరకు తనతోపాటు ఎవ‌రికి మిన‌హాయింపు లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచ‌న‌లు తీసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దాదాపుగా నామినేటేడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశామని వివరించారు. పార్టీ త‌రుపున ఇప్పుడు వేలాది మంది స‌ర్పంచ్‌లు ఉన్నారని.. అలాగే మున్సిప‌ల్ చైర్మన్లు, కౌన్సిల‌ర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వల‌స‌ పోయిన వారి ఓట్లు పోకుండా జాగ్రత్త ప‌డాల్సి ఉందన్నారు. పార్టీ నాయ‌కులంతా స‌మ‌న్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. నాయ‌కులు క్షేత్రస్థాయికి వెళ్తేనే.. కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్తారని వివరించారు.


రాజ్యస‌భ స‌భ్యులు, ఎమ్మెల్సీల‌కు హైద‌రాబాద్ ప‌రిధిలో బాధ్యతలు అప్పగించాలని పార్టీలోని ముఖ్య నేతలకు సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌ర‌ ప‌రిధిలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్ఐఆర్ పైన అసెంబ్లీల వారీగా సమావేశాలు పెట్టాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా సీఎం రేవంత్ వివరించారు. ఎస్ఐఆర్‌పైన మ‌హిళా కాంగ్రెస్ త‌రఫున క్లస్టర్ల వారీగా స‌మావేశాలు నిర్వహించాలని పార్టీలోని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్

రైతుల కృషితోనే తెలంగాణ అగ్రస్థానం: మంత్రి తుమ్మల

For TG News And Telugu News

Updated Date - May 29 , 2026 | 10:07 PM