Share News

క్యూఎస్‌లో మన సత్తా

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:07 AM

ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ (క్వాక్వరెలి సిమండ్స్‌) ర్యాంకింగ్స్‌లో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ-హైదరాబాద్‌ మరోసారి సత్తా చాటింది.

క్యూఎస్‌లో మన సత్తా
IIT Hyderabad

  • ఆసియా వర్సిటీల జాబితాలో ఐఐటీ

  • హైదరాబాద్‌కు 251వ ర్యాంకు, హెచ్‌సీయూకు 270వ ర్యాంకు

  • 325 వర్సిటీలతో జాబితాలో రెండోస్థానంలో భారత్‌

కంది, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ (క్వాక్వరెలి సిమండ్స్‌) ర్యాంకింగ్స్‌లో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ-హైదరాబాద్‌ మరోసారి సత్తా చాటింది. ఆసియా విశ్వవిద్యాలయాల్లో 251వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది 270వ స్థానంలో నిలిచిన ఈ సంస్థ ఈసారి 19 స్థానాలను మెరుగుపర్చుకోవటం విశేషం. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కి 270వ స్థానం లభించింది. గత ఏడాదితో పోల్చితే 11 స్థానాలు పైకి ఎగబాకింది. ‘క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీల ర్యాంకింగులు (ఆసియా)-2027’ జాబితాను మంగళవారం ప్రకటించారు. 66వ ర్యాంకుతో ఐఐటీ ఢిల్లీ దేశంలో తొలిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో ఐఐఎ్‌ససీ బెంగళూరు (79వ ర్యాంకు), ఐఐటీ బాంబే (83వ ర్యాంకు) ఉన్నాయి.


కాగా ఆసియా దేశాల్లోని 1722 వర్సిటీలు, విద్యాసంస్థలకు క్యూఎస్‌ ఆసియా జాబితాలో చోటు లభించింది. వీటిలో 448 విద్యాసంస్థలు, 53 యూనివర్సిటీలతో చైనా ప్రథమస్థానంలో ఉంది. 325 వర్సిటీలతో భారత్‌ రెండోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మన దేశం నుంచి కొత్తగా 34 వర్సిటీలకు చోటు దక్కింది. పరిశోధన పత్రాలు:అధ్యాపక సిబ్బంది నిష్పత్తి ప్రకారం చూసినప్పుడు టాప్‌ 50లో భారత్‌కు చెందిన 27 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ రంగంలో మనదేశమే అగ్రస్థానంలో నిలిచింది. టాప్‌ 10లో 5 భారతీయ వర్సిటీలు ఉండగా, చైనాకు చెందిన వర్సిటీలు 3 మాత్రమే ఉండటం విశేషం. భారత్‌లో వర్సిటీల నుంచి పరిశోధనల పరంగా ఉత్పాదకత అధికంగా ఉందని దీని ద్వారా వెల్లడవుతోంది. కాగా, క్యూఎస్‌ ఆసియా వర్సిటీల జాబితా టాప్‌ 10లో హాంకాంగ్‌కు చెందిన 5, చైనాకు చెందిన 3, సింగపూర్‌కు చెందిన 2 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. తొలి 3 స్థానాల్లో హాంకాంగ్‌ యూనివర్సిటీ, చైనాలోని పెకింగ్‌, త్సింగువా యూనివర్సిటీలు నిలిచాయి.


పలు అంశాల్లో పరిశీలించి ర్యాంకులు

విద్యా ప్రమాణాలు, అంతర్జాతీయ గుర్తింపు, విద్యావేత్తల అభిప్రాయాలు, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు, అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి, పరిశోధనల సంఖ్య, వాటి ప్రభావం, అంతర్జాతీయ సహకారం, అధ్యాపకుల విద్యార్హతలు వంటి పలు అంశాలను పరిశీలించి క్వాక్వరెలి సిమండ్స్‌ సంస్థ ఏటా యూనివర్సిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ఉన్నత విద్యాసంస్థల పనితీరును అంచనా వేయడానికి ఇవి ఒక ప్రామాణిక సూచికగా ఉపయోగపడుతున్నాయి. క్యూఎస్‌ జాబితాలో 251వ ర్యాంకు లభించటంపై ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి స్పందిస్తూ.. తాజా ర్యాంకింగ్స్‌లో సాధించిన పురోగతి అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:07 AM