Share News

మోదీ, షాల బంటు లోక్‌సభ స్పీకర్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:30 AM

‘‘భారత ఎన్నికల కమిషన్‌లో మిగతా ఇద్దరు కమిషనర్లతో కనీసం చర్చించకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా నిర్ణయించారనే ఒకే ఒక్క కారణం చూపి ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్‌)’ ప్రక్రియను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయచ్చు. కానీ ..

మోదీ, షాల బంటు లోక్‌సభ స్పీకర్‌
Prashant Bhushan

  • వారి ముఖ కవళికలు చూసి ఓం బిర్లా చర్చకు అవకాశమిస్తారు

  • సీఈసీ జ్ఞానేశ్‌ చేసిన తప్పునకు శిక్ష పడితే ఆయన జీవితాంతం జైల్లోనే!

  • ఈవీఎంలతో మోసాలకు అవకాశం

  • సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘భారత ఎన్నికల కమిషన్‌లో మిగతా ఇద్దరు కమిషనర్లతో కనీసం చర్చించకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా నిర్ణయించారనే ఒకే ఒక్క కారణం చూపి ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్‌)’ ప్రక్రియను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయచ్చు. కానీ ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి అలాంటి తీర్పులను ఆశించలేం’’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. గత 12 ఏళ్లుగా పార్లమెంటరీ కమిటీల వ్యవస్థను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ, చర్చలకు అవకాశమే లేకుండా కొన్ని సందర్భాల్లో ఒక్కరోజులోనే 50కుపైగా చట్టాలను ఆమోదిస్తున్న తీరును ప్రస్తుతం చూస్తున్నామంటూ పార్లమెంట్‌ సమావేశాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓం బిర్లా లాంటి వెన్నెముక లేని లోక్‌సభ స్పీకర్‌ను ఇంతవరకు చూడలేదని, ఆయన మోదీ, అమిత్‌ షాలకు బంటులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


ఏదైనా అంశాన్ని సభలో చర్చకు అనుమతించాలా లేదా అన్నది మోదీ, షా ముఖ కవళికల ఆధారంగా స్పీకర్‌ నిర్ణయిస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌ ఇంజనీర్స్‌ భవన్‌ ఆడిటోరియం వేదికగా ‘సర్‌: రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు’ అంశంపై ప్రశాంత్‌ భూషణ్‌ కీలకోపన్యాసం చేశారు. బీజేపీ ఒక్క ఏడాదిలోనే అధికారికంగా రూ.పది వేల కోట్లు విరాళాల రూపంలో సేకరించిందని, అదంతా దాదాపుగా కార్పొరేట్‌ సంస్థల నుంచి బలవంతంగా సేకరించినదేనని ఆరోపించారు. మిగతా అన్ని పార్టీల నిధులు కలిపినా, అంతకు నాలుగు రెట్లు ఎక్కువ సొమ్ము బీజేపీ దగ్గర పోగుపడుందని, అందుకే ఎన్నికల్లో వాళ్లు గెలవగలుగుతున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రశాంత్‌ భూషణ్‌ ధ్వజమెత్తారు. బీజేపీ బూత్‌స్థాయి ఏజెంట్లకు సైతం నెలకు రూ.50 వేలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ‘ఎన్నికలలో ఈవీఎంలను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు వాటిలో ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఉండేది కాదు. వాటికి వీవీ ప్యాట్‌ యంత్రాలను అనుసంధానించడంతో సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాల్సి వచ్చింది.


దాంతో ఈవీఎంలో ప్రతి రెండో ఓటు బీజేపీకి వెళ్లేలా ప్రోగ్రామ్‌ తయారుచేయడం చాలా సులభం. మాల్‌వేర్‌ ప్రయోగం లేదా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇది సాధ్యమవుతుంది కూడా. వీవీ ప్యాట్‌ యంత్రాన్ని కూడా దుర్వినియోగం చేయచ్చు. ఇదివరకు వీవీ ప్యాట్‌కు ఒక స్ర్కీన్‌ ఉండేది. మోదీ ప్రభుత్వ హయాంలో దాన్ని నల్లరంగులోకి మార్చారు. అప్పుడు వీవీ ప్యాట్‌లోని స్లిప్‌ను చూడలేం. కేవలం 5 సెకన్లపాటు బల్బువెలిగినప్పడు మాత్రమే స్లిప్‌పై ఏ గుర్తు ముద్ర ఉందో చూడగలరు. ప్రతిపక్ష అభ్యర్థికి వరుసగా రెండు ఓట్లు పడితే, మొదటి ఓటరుకు చూపించిన అదే స్లిప్‌ను రెండో ఓటరుకు కూడా చూపిచేలా వీవీప్యాట్‌లను అధికార పార్టీకి అనుగుణంగా ప్రోగ్రామింగ్‌ చేసే అవకాశం లేకపోలేదు’ అని ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ చేసిన తప్పునకు నిజంగా శిక్ష పడితే ఆయన జీవితాంతం జైల్లో మగ్గాల్సి ఉంటుందన్నారు. అవినీతి మరకలున్న అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసి మరీ, వారితో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని మోదీ, అమిత్‌ షాలపై ధ్వజమెత్తారు. జ్ఞానేశ్‌ కుమార్‌పై అలాంటి ఆరోపణ చేస్తూ ఓ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్న కేసు ఉందని, మాట వినకపోతే జైలుకు పంపుతారనే భయంతో కూడా ఆయన వాళ్లు చెప్పినట్లు ఆడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సీనియర్‌ ఎడిటర్‌ కె.రామచంద్రమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. మల్లేపల్లి లక్ష్మయ్య, దీప్తి బత్తిన తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:30 AM