22Aపై కొత్త కథలు అల్లి ప్రజలను భయపెడుతున్న ప్రతిపక్షాలు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:14 PM
హైదరాబాద్‌లో 22Aపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ అంశంపై కొత్త కథలు అల్లి ప్రజలను భయపెడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్‌లో 22Aపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. 22Aపై కొత్త కథలు అల్లి ప్రజలను భయపెడుతున్నాయని ఆయా పార్టీలపై మండిపడ్డారు. గతంలో రిలాక్స్ ఇచ్చిన వాటికి క్లియరెన్స్ ఇచ్చామని తెలిపారు. నిజమైన (జెన్యూన్‌గా) వాటిలో 98 శాతం రిజిస్ట్రేషన్ చేశామన్నారు. చేయలేనివి చేయలేమని తేల్చి చెప్పామని వివరించారు.
అయితే టోల్ ఫ్రీ నంబర్ పని చేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను మంత్రి పొంగులేటి ఖండించారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు 1,162 కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. అందులో రిపీటెడ్ కాల్స్ తొలగిస్తే.. 980 వచ్చాయన్నారు. వాటిలో 547 వ్యవసాయానికి అనుబంధమైనవి, 433 వ్యవసాయేతర కాల్స్ అని వివరించారు. రిజిస్ట్రేషన్ కాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొందరు దొంగ జీవోలు, మెమోలు తెచ్చి రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి దొంగ జీవోలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యం కాదని మంత్రి పొంగులేటి కుండ బద్దలు కొట్టారు. సిఎస్7, సిఎస్ 14పై దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెర ముందు సామాన్యులను పెట్టి వెనక తమ ఎజెండాను అమలు చేస్తున్నారని అన్నారు.
వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పలువురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఖరీదైన కార్లు తీసుకుని సిఎస్7, సిఎస్14 భూములు రిజిస్ట్రేషన్ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ విషయాన్ని లేవనెత్తడంతో వివాదంలో పడ్డాయని వివరించారు. ఆ 811 ఎకరాల భూములపై విచారణకు సిద్ధమా? అని ప్రతిపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
సర్వే నంబర్ 403లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంటుందని అన్నారు. ఆ సర్వేలో1,288 ఎకరాలు ఉండగా రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ సర్వే మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లితే సరిచేశామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్: హరీశ్ రావు
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ
Read Latest Telangana News And Telugu News