Share News

Bhu Bharati Scam: భూ భారతి అక్రమార్కులు ఎంత మంది?

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:48 AM

భూ భారతి పోర్టల్‌ ఆధారంగా జరిగిన అక్రమాల తీగ లాగుతున్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆధారాలను సేకరిస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.

Bhu Bharati Scam: భూ భారతి అక్రమార్కులు ఎంత మంది?
Bhu Bharati Scam

నిందితులను గుర్తించే పనిలో పోలీసులు

ఖాకీల అదుపులో ఇప్పటికే 14 మంది!

అత్యంత గోప్యంగా పోలీసుల విచారణ

ఒకట్రెండు రోజుల్లో మీడియాకు వివరాలు?

జనగామ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): భూ భారతి పోర్టల్‌ (Bhu Bharati Scam) ఆధారంగా జరిగిన అక్రమాల తీగ లాగుతున్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆధారాలను సేకరిస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. కుంభకోణం ఈ నెల 8న వెలుగులోకి రాగా అంతకు ఒకరోజు ముందే పోలీసులు ప్రధాన సూత్రధారితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ఇందులో భాగస్వాములైన మీసేవ, ఇంటర్నెట్‌ కేంద్రాల నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. 20 మందికి పైగా విచారించి.. కీలకంగా ఉన్న 14 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనగామకు చెందిన 8 మంది, యాదాద్రి జిల్లాకు చెందిన ఇద్దరు, కొడకండ్లకు చెందిన ఇద్దరు, నర్మెట్టకు చెందిన ఇద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


జనగామ ఏసీపీ నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధాన సూత్రధారితో పరిచయం ఎలా ఏర్పడింది? ఏయే డాక్యుమెంట్లు చేశారు? అత్యధిక మొత్తంలో ఏ డాక్యుమెంట్‌ చేశారన్న వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్ని డాక్యుమెంట్లకు సంబంధించిన స్టాంపు డ్యూటీని దారి మళ్లించారన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కుంభకోణంలో భాగస్వాములైన వారి బ్యాంకు ఖాతాలను, లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 14 మందితోపాటు మిగతా జిల్లాల్లో ఎవరెవరితో సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొడకండ్లకు చెందిన ఓ వ్యక్తి ద్వారానే భూభారతి పోర్టల్‌లో లొసుగులను గుర్తించి, అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రధాన సూత్రధారికి, ఇతనికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. కాగా, ఈ కుంభకోణంపై పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. 2 రోజుల్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి నోటీసులు

ప్రభుత్వ ఖజానాలో స్టాంపు డ్యూటీ జమ కాని రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లకు సంబంధించి జనగామ రెవెన్యూ అధికారులు ఇటీవల కొందరికి నోటీసులు ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంపు డ్యూటీ ప్రభుత్వానికి జమ కాలేదని, దాన్ని చెల్లించాలంటూ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి జనగామ తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిందితులను గుర్తించి, రికవరీ చేసుకోకుండా, తమకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 06:48 AM