పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలి... ప్రధానికి వీహెచ్ లేఖ
ABN , Publish Date - Aug 11 , 2026 | 03:14 PM
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్వాతంత్ర్య సమరయోధుడుకి, భారత జాతీయ పతాక రూపకర్తకు దేశం అందించగల ఏకైక సముచితమైన నివాళి ఇదే అని చెప్పుకొచ్చారు. భారత జాతీయ పతాకం(త్రివర్ణ పతాకం) ప్రాథమిక రూపాన్ని రూపొందించిన ఘనత పింగళి వెంకయ్యకే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌లో పింగళి వెంకయ్య విగ్రహాన్ని తాను ఏర్పాటు చేసినట్లు లేఖలో తెలిపారు.
ఇప్పుడు భారత జాతీయ పతాకం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యాన్ని, విస్తృత గుర్తింపును సాధించిందని వీహెచ్ అన్నారు. దివంగత పింగళి వెంకయ్య సేవలను తక్కువ చేసి చూడటం.. భారత పతాక రూపకర్తకు జరిగిన అవమానమన్నారు. తెలుగు రాష్ట్రానికి పింగళి వెంకయ్య సేవలను మోదీ ఎందుకు మరచిపోయారో అర్థం కావడం లేదని తెలిపారు. జాతీయ పతాక రూపకర్తకు భారతరత్న ఇవ్వాలని.. దేశ ప్రజలు ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని వెల్లడించారు.
‘ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ అంటున్నారు.. మంచిదే. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు సరైన న్యాయం జరగాలంటే భారతరత్న ఇవ్వాల్సిందే. పింగళి వెంకయ్యకు న్యాయం జరగడం వల్ల ప్రజల్లోకి ఒక మంచి సందేశం వెళ్తుంది. స్వాతంత్రం వచ్చిన 25 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగరవేశారు’ అని ప్రధానికి వీహెచ్ లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు
పేద పిల్లల కలలకు చిరునామాగా.. యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News