Mahesh Kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీపై పీసీసీ చీఫ్ క్లారిటీ
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:44 PM
కాంగ్రెస్ పార్టీలోకి కవిత ఎంట్రీపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు పీసీసీ చీఫ్.
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. మంగళవారం నాడు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.
గెలిచే అభ్యర్థులకే టికెట్
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యమని.. ఒక్క నీటిబొట్టును కూడా వదలమని తేల్చిచెప్పారు. అజారుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీల విషయంలో మంచి స్పందన వస్తోందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌లో కార్పొరేషన్ ఛైర్మన్లను భర్తీ చేస్తామని ప్రకటించారు. పదవులు తక్కువ అయ్యాయని... ఆశావహులు ఎక్కువ అయ్యారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ తరఫున ఒక కమిటీ వేస్తామని.. సర్వేల ఆధారంగా టికెట్ల ఇస్తామని చెప్పారు. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఆ సెంటిమెంట్‌తో ఓట్లు అడగం..
బీజేపీని తెలంగాణాలో నమ్మే పరిస్థితి లేదన్నారు మహేశ్ కుమార్. మత రాజకీయాలు రాష్ట్రంలో నడవవని అన్నారు. రాముడికి, బీజేపీకి సంబంధమేంటి అని ఆయన ప్రశ్నించారు. తాము హిందూ ఆచారాలను పాటిస్తామని.. కానీ హిందూ సెంటిమెంట్‌తో ఓట్లు అడగమని తెలిపారు. తనకు, సీఎం రేవంత్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు పీసీసీ చీఫ్. మంత్రులకు, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేశ్ తేల్చిచెప్పారు. ఇతర మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి తలదూర్చరన్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని వెల్లడించారు. డీ సెంట్రలైజేషన్ కోసమే మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని పీసీసీ చీఫ్ తెలిపారు.
శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన
కేసీఆర్.. కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు. శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ను ఎవరు ముట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాబరాపడుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు. పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
Read Latest Telangana News And Telugu News