Share News

Basara Temple: జ్ఞాన సరస్వతీ ఆలయంలో అవకతవకలు... ఆలస్యంగా వెలుగులోకి..

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:42 PM

బాసర సరస్వతీ దేవి ఆలయంలో అవకతవకలు జరుగుతున్నట్లు విజిలెన్స్ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణ భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు..

Basara Temple: జ్ఞాన సరస్వతీ ఆలయంలో అవకతవకలు... ఆలస్యంగా వెలుగులోకి..
Basara Temple

నిర్మల్, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో (Basara Sarswati Devi Temple) ఆర్థిక అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. ఆలయంలో భక్తుల నుంచి సేకరించే హుండీ ఆదాయం, దాన ధర్మాలు, పూజలు, ప్రసాదాలు వంటి ఆర్థిక లావాదేవీలను గోప్యంగా పరిశీలించిన విజిలెన్స్ బృందం, పలు విభాగాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణ భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చిన విజిలెన్స్ అధికారులు.. ఆలయ సిబ్బంది ఆర్థిక వ్యవహారాలు, రికార్డులు, లావాదేవీలను పరిశీలించారు. ఈ విచారణ గత కొన్ని రోజులుగా గోప్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఈ అంశాలపై విజిలెన్స్ బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. బాసర సరస్వతీ దేవి ఆలయం దేశంలోనే ప్రసిద్ధ సరస్వతీ దేవాలయాల్లో ఒకటిగా పేరుపొందింది. జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే సరస్వతీదేవి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే వారికి చదువు బాగా అబ్బుతుందని, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులు అవుతారని భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు సరస్వతీ దేవిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


ఇవి కూడా చదవండి..

కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 12:52 PM