New Year Liquor Sales: ఆ రెండు రోజుల్లో రూ.750 కోట్ల విలువైన లిక్కర్ సేల్...
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:44 PM
నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్ల విలువైన మద్యం సేల్ అయింది.
హైదరాబాద్, జనవరి 01: రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్ మరింత కిక్కిచ్చింది. మంగళ, బుధవారాలు రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెలలో మొత్తమ్మీద రూ.5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో అమ్మకాలు, ఆదాయం ఇదే అత్యధికం కావడం గమనార్హం.
అటు.. కొత్త మద్యం వ్యాపారులకు కూడా తొలినెలలోనే కాసుల వర్షం కురిసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2024 డిసెంబరులో రూ.3,800 కోట్లు, 2023 డిసెంబరులో రూ.4,297 కోట్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి రూ.1,300 కోట్లకుపైగా అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. భారీగా మద్యం విక్రయాలు ఉండవచ్చని అంచనా వేసిన ఎక్సైజ్‌శాఖ స్టాక్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా, రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ద్వారా నవంబర్‌లో దుకాణాలను కేటాయించగా.. డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొత్త వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. వారికి డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, తర్వాత క్రిస్మస్, ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు కలిసి వచ్చాయి.
డిసెంబరు తొలి రెండు వారాల్లో పెళ్లిళ్లు, పర్యాటక ప్రాంతాల్లో ఈవెంట్లతోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబరు 30న ఒక్క రోజే రూ.375 కోట్ల విక్రయాలు నమోదవగా.. 31న సాయంత్రానికే అమ్మకాలు రూ.350 కోట్లు దాటేశాయి. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త వ్యాపారులకు తొలినెలలోనే మంచి ఆదాయం రావడంతో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి:
మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం