Share News

Karnataka: మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:54 PM

కొత్త సంవత్సరం వేడుకల్లో తాగిన మత్తులో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

Karnataka: మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి
G Parameshwara

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల్లో ఎవరైనా మితిమీరి మద్యం సేవిస్తే వారి వల్ల ఇతరులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, అలాంటి వాళ్లను ఇళ్ల దగ్గర దిగబెడతామని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర (G Parameshwara) తెలిపారు. తాగిన మత్తు దిగేంతవరకూ విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను కూడా ఎంపిక చేసినట్టు బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే బెంగళూరు, మైసురు, హుబ్బళి, బెలగావి, మంగళూరులో మితిమీరి మద్యం సేవించే ఘటనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.


'మద్యం సేవించిన ప్రతి ఒక్కరినీ ఇళ్ల వద్ద దిగబెట్టలేం. మద్యం ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న వారిని, స్పృహకోల్పోయే దశలో ఉన్నవారి కోసం 15 లొకేషన్లలో విశ్రాంతి సదుపాయాలు చేశాం. మత్తు వదిలిన తర్వాత వారిని వెనక్కి పంపేస్తాం' అని మంత్రి పరమేశ్వర తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సవరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, సంతోషంగా, తగినన్ని జాగ్రత్తలతో, బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.


'బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకొందాం' అనే థీమ్‌ను బెంగళూరు పోలీసులు ఈ ఏడాది ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు. మన వేడుకలు ఇతరులకు ఇబ్బంది కారాదని, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కల్పించరాదని అన్నారు. ట్రాఫిక్ మేనేజిమెంట్, మహిళా భద్రత, క్రౌడ్ కంట్రోల్‌కు సంబంధించి పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ విధానంతో వ్యవహరిస్తారని చెప్పారు. తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


20,000 మంది పోలీసు సిబ్బంది

కాగా, కొత్త సంవత్సరం ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం అప్‌డేట్ ఇచ్చారు. ప్రజాభద్రత కోసం బెంగళూరు వ్యాప్తంగా 20,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని, ఇందులో మహిళా స్క్వాడ్‌లు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్రౌడ్ మానిటరింగ్ కోసం అధునాతన టెక్నాలజీని వాడుతున్నామని వివరించారు.


ఇవి కూడా చదవండి...

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం

అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 31 , 2025 | 06:43 PM