సాగర్ నీటి పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:16 AM
నాగార్జునసాగర్ జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అభ్యంతరం
తదుపరి భేటీలో నిర్ణయానికి త్రిసభ్య కమిటీ సిఫారసు
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి జరిగే బోర్డు సమావేశంలోనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో ఈ నెల 23న జరిగిన సమావేశం మినిట్స్‌ను బుధవారం విడుదల చేసింది. కేఆర్‌ఎంబీ లెక్కల ప్రకారం.. ఈనెల 23 నాటికి నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టం(ఎండీడీఎల్) పైన 45.40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.
ప్రాజెక్టుకు కొత్తగా ఎలాంటి ఇన్‌ఫ్లోలు లేవు. ఇందులో 10 శాతం ఆవిరి నష్టాలను తీయగా... 40.86 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని ఏపీ పట్టుబట్టగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో ఇరు రాష్ర్టాల మధ్య నీటి పంపిణీలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 14 వరకు తొలి విడతలో నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువకు 10.04 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఏపీ అధికారులు సమావేశంలో పేర్కొన్నారు. దీని ద్వారా 16 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన 426 తాగునీటి ట్యాంకులను నింపినట్లు వెల్లడించారు.
మరోవైపు డిసెంబరు నుంచి 2027 ఫిబ్రవరి వరకు నాగార్జునసాగర్ నుంచి మొత్తం 21 టీఎంసీల నీరు అవసరమని తెలంగాణ అధికారులు ఇండెంట్ సమర్పించారు. ఇందులో 15 టీఎంసీలు ఎన్‌ఎస్ఎల్‌సీకి, 6 టీఎంసీలు ఏఎంఆర్‌పీకి అవసరమని పేర్కొన్నారు. దాంతో కేడీఎస్ అవసరాలపై ఏకాభిప్రాయం కుదరనందున... నీటి విడుదలపై సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోలేదని కృష్ణాబోర్డు మెంబర్ కన్వీనర్ సతీష్ కంబోజ్, తెలంగాణ ఈఎన్‌సీ రమేష్‌బాబు, ఏపీ ఈఎన్‌సీ నర్సింహామూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News