మూసీ ప్రాజెక్టుకు.. దసరా ముహూర్తం!
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:08 AM
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ప్రాజెక్టు తొలిదశ (ఫేజ్-1) పనులకు దసరా రోజున శంకుస్థాపన చేసేలా అఽధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
శంకుస్థాపన, పనుల ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం
ఏడీబీ నుంచి రుణ మంజూరు కొలిక్కి
ఫేజ్-2 డీపీఆర్ పనులు ప్రారంభించిన అధికారులు
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ప్రాజెక్టు తొలిదశ (ఫేజ్-1) పనులకు దసరా రోజున శంకుస్థాపన చేసేలా అఽధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తొలిదశ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7,345.12 కోట్లతో పరిపాలనా అనుమతిని ఇచ్చింది. అందులో రూ.4,500 కోట్లు ఏడీబీ నుంచి రుణం తీసుకోనుండగా, మిగతా రూ.2,845.12 కోట్లను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా సమకూర్చేలా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రుణసంస్థ ఏడీబీకి అధికారులు ఫేజ్-1 డీపీఆర్‌ను ఇప్పటికే అందించారని, రుణ మంజూరు కూడా చివరిదశలో ఉందని సమాచారం. ఈ క్రమంలోనే దసరాకు శంకుస్థాపన జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫేజ్-1 కింద రెండు మార్గాల్లో.. మూసీ నది అనంతగిరి కొండల నుంచి మూసా, ఈసీ పేరిట రెండు వేర్వేరు పాయలుగా ప్రవహిస్తుంది. ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై గండిపేట (ఉస్మాన్‌సాగర్) రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల తర్వాత దిగువకు పారే రెండు నదీ పాయలు లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ ప్రాంతంలో కలిసి మూసీగా ఏకమవుతాయి. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు ఫేజ్-1లో ఈసీ నదిపై హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.2 కిలోమీటర్ల మేర.. మూసా నదిపై ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపడతారు. ఈ రెండింటినీ సమాంతరంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిర్మాణం, పన్నుల చెల్లింపు, సుందరీకరణ తదితర పనులకు కలిపి టెండర్లను ఆహ్వానించనున్నట్టు తెలిసింది. మరోవైపు నాగోలు నుంచి గౌరెల్లి వరకు ప్రతిపాదించిన ఫేజ్-2 పనుల డీపీఆర్ తయారీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఫేజ్-2 కింద సుమారు 55 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా.. నదిలో పేరుకున్న వ్యర్థాల తొలగింపు, నదిలో నీటిని నిల్వ చేసి బోటింగ్‌కు ఏర్పాట్లు చేయడం, మూసీ నది ఒడ్డున ఇరువైపులా రోడ్లు, ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి, సైకిల్ ట్రాక్, పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, నదిలో మురుగు చేరకుండా ఇరువైపులా ట్రంక్ లైన్ల నిర్మాణం, వర్షపు నీటి డ్రెయిన్ల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. ఇక ఫేజ్-1 పనుల ప్రారంభం తరువాత హైదరాబాద్ గేట్ వే నిర్మాణానికి సంబంఽధించిన పనులపై దృష్టి పెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News