రామ జన్మభూమి ట్రస్ట్ అవినీతి వ్యవహారంలో వాస్తవాలు చెప్పాల్సిందే: ఎంపీ చామల
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:10 PM
అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల అవకతవకలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. దేశ వ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని విరాళాలు వసూలు చేశారన్నారు.
హైదరాబాద్, జూన్ 26: అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల అవకతవకలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదని కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారని.. కానీ యూపీ సిట్ పోలీసులు చంపత్ రాయ్ మనుషులను అరెస్టు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని విరాళాలు వసూలు చేశారని అన్నారు. చంపత్ రాయ్‌ను ట్రస్ట్ కార్యదర్శి పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. యూపీ సీఎం పదవికి యోగీ ఆదిత్య నాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది యూపీకి సంబంధించిన వ్యవహారం కాదని.. దేశ ప్రజలకు సంబంధించిన అంశమన్నారు.
అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని ఎంపీ ఆరోపణలు చేశారు. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ ప్రజలకు చెప్పాలన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎంపీలు 20 మందిని, మహారాష్ట్రలో శివసేన ఉద్దవ్ థాక్రే ఎంపీలు 6 మందిని.. ఒక్కొక్కరికీ రూ.75 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందంటూ వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి ట్రస్ట్ అవినీతి వ్యవహారంలో ప్రధాని మోదీ, అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడారని చామల మండిపడ్డారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాను పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. దేశంలో ప్రజలు ఏ స్థితిలో ఉన్నా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారన్నారు. ‘ప్రజలు దేవుడి కోసం డబ్బులు ఇచ్చారు. మీరు దోచుకోవడం కోసం కాదు’ అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి
తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌పై కేసు
Read Latest Telangana News And Telugu News