Share News

పైలెట్ ప్రాజెక్టుగా పంజాగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్ ఎంపిక

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:31 PM

మోడల్ పోలీసింగ్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు సేవల్లో వినియోగించేందుకు పంజాగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

పైలెట్ ప్రాజెక్టుగా పంజాగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్ ఎంపిక
, Panjagutta Model Police Station

హైదరాబాద్, అక్టోబర్ 28: మోడల్ పోలీసింగ్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు సేవల్లో వినియోగించేందుకు పంజాగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఫిర్యాదుదారులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా పోలీసు సేవలు అందించేందుకు రూపొందించిన ‘సేతు’ యాప్ పనితీరును ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. యాప్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నిర్వాహకులను అడిగి దాని పనివిధానం, ఉపయోగాల గురించి వివరాలు తెలుసుకున్నారు.


చదువురాని వారు సైతం ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు నమోదు చేసుకునేలా ఈ అధునాతన సాంకేతిక విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో ఫిర్యాదుదారులు కాగితాలు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, ఫిర్యాదు నమోదు చేసే యంత్రం ముందు నిలబడి తమ వివరాలను నమోదు చేయాలి. అనంతరం యంత్రం టోకెన్‌ను జనరేట్ చేస్తుంది.


ఆ తర్వాత సుమారు 30 సెకన్ల వ్యవధిలో ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదు వివరాలను వీడియో రికార్డింగ్ రూపంలో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ రికార్డింగ్ ఆధారంగా ఫిర్యాదు సంబంధిత అడ్మిన్ ఆఫీసర్‌తో పాటు సంబంధిత సెక్టార్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)కు చేరుతుంది. పేపర్ అవసరం లేకుండా, టెక్నికల్ సహాయంతో ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత అధికారులకు చేరవేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఫిర్యాదుల నమోదు ప్రక్రియను సరళతరం చేయడం ఈ పైలెట్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

AAVGF ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 2K వాక్

ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 28 , 2026 | 08:31 PM