Share News

ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:30 PM

ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం)రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి సీఎం మీడియాతో మాట్లాడారు

ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 28: ఆర్నబ్ తుఫానుతో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం)రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి సీఎం మీడియాతో మాట్లాడారు. ఆర్నబ్ తుఫాన్ గురించి పలు విషయాలను సీఎం వెల్లడించారు. ఈ తుఫానుపై మూడు రోజుల్లోనే 7 సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం జిల్లా కలెక్టర్లకు, క్షేత్రస్థాయికి సమాచారం పంపి నష్ట తీవ్రతను తగ్గించామని వెల్లడించారు.


ప్రజలకు అండగా ఉంటాం..

తుఫాను ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించటమే ప్రాధాన్యంగా పని చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయం వరకూ అందరూ రాత్రి, పగలు పనిచేశారు. ముందుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను షెల్టర్‌లకు తరలించటంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. అర్నబ్ తుఫాన్ కారణంగా పంటలు, ఇళ్లు, ఆస్తులు నష్ట పోయిన వారిని కోలుకునే విధంగా చేయూత ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. గడచిన మూడు రోజులుగా నిరంతరం పనిచేస్తున్న అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు అన్నారు.


వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి...

'విశాఖలో ఓ వ్యక్తిపై విద్యుత్ స్తంభం, చెట్టుకూలి ఇద్దరు, అనకాపల్లిలో ఒకరు భీమవరంలో మరొకరు మృతి చెందారు. వీరికుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తుఫాను తీవ్ర ప్రభావం కారణంగా వీరి ప్రాణాల్ని కాపాడుకోలేకపోయాం. రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి తుఫాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షించాం. సాంకేతికత సాయంతో తుఫాను తీవ్రత ఎక్కడెక్కడ ఉంటుందో అంచనా వేశాం. ఐఎండీతో పాటు ఇతర ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ పనిచేశాం. సముద్రంలో వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీ తీరంపై తుఫాను 10 గంటలపాటు నిలిచి పోయింది. తుఫాను కారణంగా లోటు వర్షపాతం 12 శాతం మేర తగ్గింది. విశాఖలో 21 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. విజయనగరం 18, శ్రీకాకుళం జిల్లాల్లో 14 సెంటిమీటర్ల మేర వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.


కొన్ని చోట్ల ఆస్తి నష్టం..

'శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షపు నీళ్లతో ఏ చెరువు నింపవచ్చు, ఏ రిజర్వాయర్ నింపాలన్నది ముందుగానే ప్రణాళిక చేశాం. సమర్ధవంతమైన నీటి నిర్వహణతో ఈ ప్రణాళికను అమలు చేస్తున్నాం. ముందస్తు చర్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క చెరువుకు కూడా గండి పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రహదారుల ముంపు పరిస్థితుల్ని ఆర్టీజీఎస్ నుంచి పర్యవేక్షించాం. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, ఆహారం కూడా అందించేందుకు డ్రోన్లను కూడా సిద్ధం చేసుకున్నాం. 30 వేల మంది క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందితో నిరంతరం టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ పర్యవేక్షించాను. తుఫాను రాష్ట్రం దాటి వెళ్లినా కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరిలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ విద్యుత్‌ను పునరుద్ధరించాం. రాష్ట్ర రహదారులు, పంచాయతీ రోడ్లపై రాకపోకలను ఈ రాత్రికే పునరుద్ధరిస్తున్నాం' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

తిరుచ్చి ఎయిర్‌పోర్టులో వన్యప్రాణుల రవాణా ప్రయత్నం భగ్నం

ఆర్నబ్ తుఫాను ప్రభావం.. చెన్నైలో రోడ్లపైకి ఎగసిపడుతున్న అలలు

Updated Date - Oct 28 , 2026 | 07:10 PM