5 స్టార్ హోటల్‌లో కస్టమర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:03 PM
ఫైవ్ స్టార్ హోటల్‌లోని వెయిటర్‌పై చేయి చేసుకున్నందుకు ఓ కస్టమర్‌పై జీవితకాల నిషేధం విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫైవ్ స్టార్ హోటల్‌లోని వెయిటర్‌పై చేయి చేసుకున్నందుకు ఓ కస్టమర్‌పై జీవితకాల నిషేధం విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. హోటల్‌ను నిర్వహిస్తున్న సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పరితోష్ లాధానీ ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు. ఇంత అవమానం ఎదురైనా ఆ వెయిటర్ తమకు మాటమాత్రమైనా చెప్పకపోవడం మరింత కలిచివేసిందని అన్నారు.
సామాన్య గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆ వెయిటర్‌కు ఇంగ్లిష్‌పై పట్టులేదని చెప్పారు. ఆ కారణంగా కస్టమర్ చెప్పిన దాన్ని వెయిటర్ సరిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. చివరకు పొరపాటు జరగడంతో కస్టమర్ ఆ వెయిటర్‌పై చేయి చేసుకున్నట్టు వివరించారు. ఇంతటి అవమానం జరిగినా ఆ వెయిటర్ తమకు మాటమాత్రమైనా చెప్పలేదని అన్నారు. అవమానాన్ని దిగమింగుకుని అలాగే ఉండిపోయారని చెప్పారు. ఆ తరువాత విషయం తమకు తెలిసి ఆరా తీయగా వెయిటర్ చెప్పిన సమాధానం తన మనసును కలిచివేసిందని చెప్పారు.

తమ హోటల్‌లో పని చేయడం తన కలని వెయిటర్ చెప్పాడని అన్నారు. కానీ ఈ విషయం బయటపడితే సువర్ణావకాశం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో అతడు మిన్నకుండిపోయాడని చెప్పారు. ఆ వెయిటర్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడో తనకు అప్పుడు అర్థమైందని చెప్పారు. ఈ క్రమంలో కస్టమర్‌ను బ్లాక్ లిస్ట్ చేశానని చెప్పారు. కస్టమర్స్ ఎంతటి పలుకుబడి కలిగిన వారైనా, ఎంతటి ధనవంతులైనా తమ సిబ్బందిని అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బలహీన స్థితిలో ఉండే ఉద్యోగులను కాపాడాల్సిన బాధ్యత సంస్థలపై కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పరితోష్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో వన్యప్రాణుల రవాణా ప్రయత్నం భగ్నం
ఆర్నబ్ తుఫాను ప్రభావం.. చెన్నైలో రోడ్లపైకి ఎగసిపడుతున్న అలలు