Share News

టీమిండియా వికెట్ కీపర్ నుంచి హిందీ సినిమా డైలాగ్‌!

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:28 PM

వడోదర వేదికగా జింబాబ్వే మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ యస్తికా భాటియా చేప్పిన ఓ బాలీవుడ్ సినిమా డైలాగ్ వికెట్ స్టంప్స్‌లో రికార్డైంది.

టీమిండియా వికెట్ కీపర్ నుంచి హిందీ సినిమా డైలాగ్‌!
Yastika Bhatia Viral Dialogue

స్పోర్ట్స్ డెస్క్: వడోదర వేదికగా జింబాబ్వే మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ యస్తికా భాటియా చెప్పిన ఓ బాలీవుడ్ సినిమా డైలాగ్ వికెట్ స్టంప్స్‌లో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జింబాబ్వే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మను ఉత్సాహపరిచేందుకు యస్తికా బాలీవుడ్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2' లోని పాపులర్ డైలాగ్‌ను ఉపయోగించింది.


'వైషు.. సబ్ కా బాదల్ లేనా హై.. బాప్ కా, దాదా కా, భాయ్ కా(అందరి ప్రతీకారం తీర్చుకోవాలి.. తండ్రిది, తాతది, అన్నది)' అంటూ స్టంప్స్ వెనుక నుంచి భాటియా వ్యాఖ్యానించింది. ఆమె చెప్పిన ఈ డైలాగ్ మైదానంలో నవ్వులు పూయించడంతో పాటు, బౌలర్లో జోష్ నింపాయి. యస్తికా మాటలకు తగినట్లుగానే 20 ఏళ్ల యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అద్భుత బౌలింగ్‌తో చెలరేగింది. జింబాబ్వే బ్యాటర్లను తన మాయాజాలంతో బోల్తా కొట్టించి కేవలం 39 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.


వన్డేల్లో వైష్ణవికి ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఆమె దెబ్బకు జింబాబ్వే జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. రెండో వన్డేలోనూ నాలుగు వికెట్లు తీసి రాణించిన వైష్ణవి, ఈ చివరి మ్యాచ్‌లోనూ తన జోరును కొనసాగించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2'లో ఫైజల్ పాత్రలో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ.. ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన తన తండ్రి, తాత, సోదరుడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఈ డైలాగ్ చెబుతాడు.


ఈ వార్తలూ చదవండి

ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 28 , 2026 | 07:38 PM