Share News

తాగునీటి సమస్య పరిష్కారానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:50 PM

మిషన్ భగీరథపై మంత్రి సీతక్క ఈరోజు(శనివారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్యలు రాకుండా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం: మంత్రి సీతక్క
Minister Seethakka

హైదరాబాద్, జులై 25: మిషన్ భగీరథపై మంత్రి సీతక్క ఈరోజు(శనివారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్యలు రాకుండా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు. సింగూరు, పాలేరు నీటి నిల్వలపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ రిజర్వాయర్ల నీటిమట్టాలను సమీక్షించాలని సూచించారు. స్థానిక నీటి వనరులను వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. బోర్‌వెల్స్ వద్ద రీఛార్జింగ్ పిట్స్, రైన్‌వాటర్ హార్వెస్టింగ్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులతో నీటి సరఫరాపై సమాచారం అందించాలని మంత్రి సూచనలు చేశారు. మహిళా సంఘాలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సమన్వయంతో నీటి నిర్వహణ చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకూడదని మంత్రి స్పష్టం చేశారు.


దేశవ్యాప్తంగా ఎల్‌నీనో పరిస్థితులు ఉన్నాయని.. ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉందని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అశ్రద్ధ వహించినా.. అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాల కోసం వెచ్చించుకోవచ్చని తెలిపారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యం నివ్వాలని కేంద్రం గైడ్లైన్స్ కూడా ఇచ్చిందన్నారు.


ఎక్కడైనా గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడితే ఆర్థిక సంఘం నిధులతో మంచినీటిని సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొద్దన్నారు. పైప్ లీకేజీలు, రిపేర్ల కారణంగా ఏదైనా ఒక రోజు నీటిని సరఫరా చేయలేని పరిస్థితుల్లో.. గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా ప్రజలు సంసిద్ధంగా ఉంటారని చెప్పారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మిషన్ భగీరథ ఇంజనీర్లు మరింత జవాబుదారితనంగా ఉండాలని తెలిపారు. 2023లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సమర్థవంతంగా పనిచేసి ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.


ఎల్‌నినో పరిస్థితులను సవాళ్లుగా తీసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా అధిగమించాలని అధికారులకు సీతక్క సూచించారు. కొన్ని గ్రామాల్లో పరిస్థితులు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని.. అక్కడ వారం రోజులలోపు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథతో అనుసంధానం చేయని ఆదివాసి గిరిజన గ్రామాల్లో ఏఈలు పర్యటించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. మండల వారీగా సర్పంచ్‌లతో ఏఈలు సమావేశం కావాలని.. మండలంలో జరుగుతున్న మంచినీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

జగిత్యాల జిల్లాలో విషజ్వరాల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి

‘నా టికెట్ రాజ్‌గోపాల్ ఇవ్వలేదు’.. ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 03:32 PM