కవితపై ఆ వ్యాఖ్యలు పొరపాటే: మంత్రి సీతక్క
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:20 AM
తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడే క్రమంలో తన నోటి వెంట దొర్లిన పదానికి చింతిస్తున్నానని మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు.
ములుగు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడే క్రమంలో తన నోటి వెంట దొర్లిన పదానికి చింతిస్తున్నానని మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. ఆ మాట ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని, అసంకల్పితంగా దొర్లిన ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నానని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగులో సోమవారం జరిగిన కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం పింఛన్ల్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించానని సీతక్క వివరించారు.
ఈ సందర్భంగా రాజకీయ కక్షతో తనను క్యాన్సర్ పేషెంట్‌గా బీఆర్‌ఎస్ చిత్రీకరించిందని కవిత ఓ ఛానల్‌కు చెప్పిన విషయాన్ని ఉటంకించే క్రమంలో పొరపాటున ఎయిడ్స్ అనే పదం దొర్లిందని తెలిపారు. వెంటనే తన పొరపాటును సరిదిద్దుకున్నానని స్పష్టం చేశారు. అయితే, రాజకీయ అక్కసుతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆ వీడియోను వైరల్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని సీక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News