ఉద్యమకారులు అప్పులపాలైతే.. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు గడించింది: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Sep 17 , 2026 | 09:25 PM
అధికారం అండగా.. ధరణి ఆయుధంగా.. ప్రభుత్వ, దళితుల భూములే లక్ష్యంగా.. కల్వకుంట్ల కుటుంబం భూ దోపిడీకి తెరలేపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు.
హైదరాబార్, సెప్టెంబర్ 17: ఒకప్పుడు ఒక్క ఎకరం మాత్రమే ఉన్న కేటీఆర్‌కు నేడు వందల ఎకరాల భూ సామ్రాజ్యం ఎక్కడినుంచి వచ్చిందని రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు. అధికారాన్ని చూసుకుని.. ధరణి ఆయుధంగా.. ప్రభుత్వ, దళితుల భూములే లక్ష్యంగా.. కల్వకుంట్ల కుటుంబం భూ దోపిడీకి తెరలేపిందని ఆయన ధ్వజమెత్తారు.
‘తండ్రి భూ దందాలను చూశాం.. ఇప్పుడు ‘డ్రా’మారావు భూదోపిడీలను చూద్దాం..’ అంటూ కేటీఆర్‌పై మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ ఏళ్ల తరబడి కేటీఆర్ తన అమెరికా సక్సెస్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.. చిన్నప్పటి నుంచే తనకు వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పుకున్నారు. కానీ కేటీఆర్ స్వయంగా దాఖలు చేసిన 2009 ఎన్నికల అఫిడవిట్ మాత్రం ఒక్క ఎకరం భూమి ఉన్నట్లు చెబుతోంది. మరి 1 ఎకరం భూమి, వందల ఎకరాలుగా, వేల కోట్ల విలువైన భూములుగా ఎలా మారింది? ’ అని మంత్రి నిలదీశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు అప్పులపాలైతే.. కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకుందని మంత్రి ఆరోపించారు. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల పునాదుల మీద కల్వకుంట్ల కుటుంబం భారీ ఆస్తులను కూడబెట్టుకుందని దుయ్యబట్టారు. కుటుంబ పాలనలో అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకున్న కేటీఆర్ ఇప్పుడు తెలంగాణకు నీతులు చెబుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్