Share News

నిజామాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరం.. చట్టప్రకారం శిక్ష తప్పదు: మంత్రి దామోదర

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:05 PM

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌‌ సౌమ్యను మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

నిజామాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరం.. చట్టప్రకారం శిక్ష తప్పదు: మంత్రి దామోదర
Minister Damodar Rajnarsimha

హైదరాబాద్, జనవరి 26: నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం పరామర్శించారు. సౌమ్యపై దాడి దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎక్సైజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు మంత్రి.


ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని రాజ నర్సింహ అన్నారు. ఇందులు కారకులైన ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగైనప్పటికీ.. ఇంకా ఆమె కండీషన్ క్రిటికల్‌గానే ఉందని తెలిపారు. నిమ్స్‌లో సుశిక్షితులైన సీనియర్ వైద్యుల బృందం, సౌమ్యకు అత్యాధునిక వసతులతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. సౌమ్య సంపూర్ణంగా కోలుకుటుందని ఆశిస్తున్నామన్నారు. ఆమె కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. విధి నిర్వాహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేయించామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో సౌమ్యను పరామర్శించిన మంత్రికి ఆమె ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, వైద్యులు వివరించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్

ప్రజల విశ్వాసమే మా బలం.. వారి భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ సజ్జనార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 04:55 PM