ప్రజల విశ్వాసమే మా బలం.. వారి భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ సజ్జనార్
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:14 AM
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కార్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు సీపీ సజ్జనార్. దేశ భద్రత కోసం వేలాది మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారన్న ఆయన.. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జనవరి 26: 77వ గణతంత్ర దినోత్సవం(77th Republic Day) సందర్భంగా నగర పోలీస్ కమిషనర్(సీపీ) సజ్జనార్ (CP Sajjanar) ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా ప్లేట్లబురుజులోని కార్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన సీపీ.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేడు అత్యంత పవిత్రమైనదని, స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. దేశ భద్రత కోసం వేలాది మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
బాధితులకు మొదటి ప్రాధాన్యం..
హైదరాబాద్‌ను దేశంలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి చేస్తోందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వివరించారు. పోలీసింగ్‌లో మానవీయ దృక్పథం ఉందన్న ఆయన.. విక్టిమ్, సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్‌తో బాధితులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేశామని గర్వంగా పేర్కొన్నారు.
నేరాల నివారణే లక్ష్యంగా..
మహిళలు, చిన్నారుల కేసుల్లో తక్షణ చర్యలు, 24/7 స్పందన ఉంటుందని తెలిపారు. EYES(Empowering Your Everyday Safety) యాప్ ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని సజ్జనార్ వివరించారు. కేసులు నమోదు చేయడమే కాదు.. బాధితులకు న్యాయం అందేవరకూ పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. నేరాల నివారణే లక్ష్యంగా ‘Prevention is Better than Cure’ విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు.
చట్టం అందరికీ సమానమే..
హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి చేశామని.. ప్రాణ రక్షణే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు సీపీ. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా, వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు బలమని, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచామని చెప్పారు. ప్రజల సహకారంతోనే సురక్షిత సమాజం సాధ్యమని ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువల పట్ల అందరూ నిబద్ధత చూపాలని తెలిపారు. చట్టం అందరికీ సమానమని, న్యాయం అందరి హక్కు అని సజ్జనార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్
Read Latest Telangana News And Telugu News